తమిళనాడు జల్లికట్టు – ఏపీ ప్రత్యేక హోదాను ముడిపెట్టి ‘ఉత్తరాది – దక్షిణాది’లపై కేంద్రం చూపుతున్న వివక్షను ఎత్తిచూపిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు గురించి తెలిసిందే. అయితే తాజాగా అదే దక్షిణాది మాట ప్రముఖ సినీ నటి గౌతమీ నోటి వెంట వచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోజుల్లో ఆమె ఆరోగ్యంపై గోప్యత పాటించారని, సందర్శించేందుకు వచ్చిన ప్రముఖులకు ఆమెను చూపించలేదని, ఆమె ఆరోగ్యం, మృతిపై పలు సందేహాలున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీకి గౌతమీ లేఖ రాసిన విషయం తెలిసిందే.
దీనిపై పీఎంవో నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గౌతమి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. అయితే ఈ సారి బహిరంగ లేఖతో కొట్టింది. ప్రధాని మోడీ తమిళనాడు సమస్యలను పట్టించుకోవడం లేదని ఈ లేఖలో ఆరోపించింది. అంతే కాకుండా గతంలో తాను రాసిన లేఖపై ఇంతవరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించింది. సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటూ దేశ ప్రజలను ఉద్దేశించి గొప్ప గొప్ప ప్రసంగాలు చెబుతారని గుర్తు చేసిన ఆమె, తాను రాసిన లేఖపై ఇంతవరకు స్పందించలేదని ప్రశ్నించింది.
భారతదేశమంతా తనకు ఒకటేనని మోడీ భావిస్తే, దక్షిణాదిలో ప్రధానంగా తమిళనాడులో ఏర్పడిన సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నించింది. జయలలిత మృతిపై ప్రజల్లో ఏర్పడిన సందేహాలను ఎందుకు నివృత్తి చేయలేదని అడిగింది. గౌతమీ ప్రశ్నల వర్షం ఒక్క తమిళనాడు గురించే అయినా… దక్షిణాది గురించి ప్రత్యేకంగా పేర్కొనడంతో… భవిష్యత్తులో ఉత్తరాది – దక్షిణాది మధ్య కాస్త దూరం పెరిగే సంకేతాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ, తమిళనాడు వంటి ప్రధాన రాష్ట్రాల నుండి ఈ మాటలు వ్యక్తమవుతుండడం, వీటికి మరింత ప్రాధాన్యతను చేకూరేలా చేస్తున్నాయి.



