జనసేనాని పవన్ కళ్యాణ్‌ను సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, నేతలు ఎన్నిసార్లు కించపరుస్తూ మాట్లాడినా సహనం కోల్పోలేదు. చాలా ఓర్పుగానే హద్దు మీరకుండా జవాబులు ఇచ్చేవారు. కానీ తొలిసారిగా ఇవాళ్ళ వైసీపీ నేతలను ఉద్దేశ్యించి “ఒరేయ్ వెదవల్లారా… మరోసారి ప్యాకేజి అని అంటే చెప్పు తీసుకొని ఒక్కొక్కడి చెంప పగలగొడతాను కబద్ధార్” అంటూ హెచ్చరించడం గమనిస్తే వైసీపీ నేతల ర్యాగింగ్‌తో ఆయన ఎంతగా విసుగెత్తిపోయారో అర్దం అవుతుంది.
ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను ఓ కారు కొంటే కూడా వాళ్ళిచ్చారు డబ్బులు వీళ్ళిచ్చారు అంటూ పిచ్చవాగుడు వాగుతుంటారు. ఒరేయ్ వెదవల్లారా… ఈ 8 సంవత్సరాలలో నేను ఆరు సినిమాలు చేసి సుమారు రూ.100-130 కోట్లు సంపాదించాను. దాని కోసం జీఎస్టీ కాకుండా రూ.33 కోట్లు ఆదాయపన్ను చెల్లించాను…” అంటూ తన ఆదాయం, పార్టీకి వచ్చిన విరాళాలు, ఖర్చుల వివరాలను గణాంకాలతో సహా వివరించారు.
నేను మీలాగా అక్రమార్జన చేయడంలేదని, పార్టీ కోసమే సినిమాలు చేసి డబ్బు సంపాదిస్తున్నానని చెప్పారు. అదీ సరిపోకపోవడంతో తన పిల్లల పేరిట వేసిన ఫిక్ డిపాజిట్లు బ్రేక్ చేసి ఆ డబ్బుతో ఈ మంగళగిరి కార్యాలయం ఏర్పాటు చేసుకొన్నానని ఎవరికీ తెలియని కొత్త విషయం ఈరోజు పవన్ కళ్యాణ్ బయటపెట్టారు. “కనుక నాకు ఎవరో ఏదో ప్యాకేజి ఇస్తున్నారంటూ పిచ్చి కూతలు కూస్తే ఇదిగో ఈ చెప్పుతో కొడతానంటూ…” పవన్ కళ్యాణ్ తన చెప్పు తీసి చూపి మరీ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇంతకాలం తన సహనమే మీ అందరినీ కాపాడుతోందని పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం. “నేను సహనంగా అన్నీ భరిస్తుంటే నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకొని అన్యాయం చేశానంటూ విమర్శలు చేస్తున్నారు. నేను నా మొదటి భార్యకు రూ.5 కోట్లు, రెండో భార్యకు నా ఆస్తి రాసిచ్చేశాను… ఈ విషయం కారుకూతలు కూస్తున్న వైసీపీ నేతలెవారికైనా తెలుసా?” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
“వైసీపీలో కాపు నేతలు జగన్‌కు ఊడిగం చేసుకోవాలంటే నిరభ్యంతరంగా చేసుకోండి కానీ కాపులను కించపరుస్తూ మాట్లాడొద్దు. జనసేన పార్టీ అన్ని కులాలను కలుపుకుపోయి అందరికీ రాజ్యాధికారం కల్పించాలనుకొంటుంది తప్ప ఏదో ఓ కులానికో, మతానికో, ప్రాంతానికో ప్రాధాన్యం ఇవ్వదని,” పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. “వైసీపీలో అందరూ నీచులని నేను అనడం లేదు కానీ ఆ పార్టీలో నీచుల సమూహాలు ఎక్కువగా ఉన్నాయని,” పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇంతకాలం తాను చాలా సహనంతో రాజకీయాలు చేశానని ఇక నుంచి వేరే స్థాయిలో ఉంటాయని, ఇక నుంచి రోజూ వైసీపీతో యుద్దమే అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.





