2018 సంక్రాంతి పండగ సమయంలో పెద్ద సినిమాలే ఓ మూడు, నాలుగు, చిన్న సినిమాలు ఓ రెండు, మూడు విడుదల అవుతాయి, దీంతో ఈ సంక్రాంతి సినీ ప్రేక్షకులకు రియల్ ఫీస్ట్ ను ఇవ్వడం ఖాయం అంతా భావించారు. కానీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో సినిమా ‘అవుట్ ఆఫ్ రేస్’ అనిపించుకుంటోంది. ప్రిన్స్ మహేష్ బాబు “భరత్ అనే నేను” ఇప్పటికే వాయిదాను ఖరారు చేయగా, తాజాగా అనుష్క “భాగమతి” కూడా వాయిదా వేసినట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అనుష్క “భాగమతి” సంక్రాంతి పండగకు ఖాయం అనుకున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన కూడా లభించింది. కానీ సంక్రాంతి నుండి రిపబ్లిక్ డేకు “భాగమతి” విడుదల పోస్ట్ పోన్ అయ్యిందనేది ట్రేడ్ టాక్. అదే నిజమైతే సంక్రాంతి ‘కింగ్’గా పవన్ కళ్యాణ్ ఒక్కడే నిలవడం ఖాయం. బరిలో నందమూరి నటసింహం బాలకృష్ణ “జై సింహా” ఉన్నప్పటికీ, సీనియర్ హీరోగా బాలయ్యకున్న క్రేజ్ తో పవన్ ను పోల్చలేం. దీంతో పవన్ – త్రివిక్రమ్ మూవీ సంక్రాంతి సెన్సేషన్ నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన కొన్ని స్టిల్స్ పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా, తాజాగా మరో స్టిల్ అందుకు తోడయ్యింది. వెనుక ఏసుప్రభు, ముందు టాబ్లెట్ పట్టుకున్న పవన్ కళ్యాణ్ స్టిల్ అదిరిపోయేలా ఉందని పవర్ స్టార్ ఫ్యాన్స్ షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. టాలీవుడ్ సింహాసనంపై పవన్ కళ్యాణ్ కూర్చుండగా, దానిని ఏసుప్రభు ఆశీర్వదిస్తున్నాడంటూ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ కు కొదవలేదు.


