రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పుకోవాలంటే కట్టే-కొట్టే-తెచ్చే అన్నట్లుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి చెప్పుకోవాలంటే ముచ్చటగా అప్పులు-తిప్పలు-పధకాలు అని చెప్పుకోవచ్చు. అదే… రాష్ట్రం గురించి చెప్పుకోవాలంటే ‘ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం… గుంతల మద్య రోడ్లను వెతుకొంటూ పడుతూ లేస్తూ ముందుకు సాగిపోవడమే..’ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా దీనిని దృవీకరించారు.
కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని ముత్తుకూరు గ్రామంలో ఈరోజు ఆయన గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రజలు ‘గుంతల పడిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు వేయిస్తానన్నారు… ఇంకా ఎప్పుడు వేయిస్తారంటూ’ నిలదీశారు.
మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, “నిజమే ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. కొత్త రోడ్లు వేయించేందుకు గత ఏడాది శంకుస్థాపన కూడా చేశాను. కానీ నిధులు కొరత వలన ఇంతవరకు రోడ్లు వేయించలేకపోయాను. మొన్న సిఎం జగన్మోహన్ రెడ్డిని క్యాంప్ ఆఫీసులో కలిసినప్పుడు ఆయనకు ఈ రోడ్ల పరిస్థితి వివరించి నిధులు మంజూరు చేయమని అడిగాను. ఆగస్ట్ నెలలో రూ.2,000 కోట్లు వస్తాయని వాటిలో కేటాయిస్తానని ముఖ్యమంత్రిగారు హామీ ఇచ్చారు. కనుక ఆగస్ట్ 15వ తేదీ తరువాత ఆలూరు నియోజకవర్గం పరిధిలో అన్ని రోడ్లు వేయిస్తానని వైఎస్ రాజశేఖ రెడ్డి సాక్షిగా నేను మీకు హామీ ఇస్తున్నాను,” అని చెప్పారు.
మంత్రిగారి మాటలను బట్టే జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత సంక్షేమ పధకాలే తప్ప అభివృద్ధికాదని స్పష్టమవుతోంది. జగన్ ప్రభుత్వం అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని ఇప్పటికే స్పష్టమైంది. కనీసం తమ మంత్రులు శంకుస్థాపనలు చేసిన ఇటువంటి చిన్న చిన్న పనులైనా పూర్తిచేయలేకపోవడం చాలా దారుణం.
ఇది కర్నూలు జిల్లాలో ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలలో రోడ్ల పరిస్థితి ఇదే. కనుక ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నిధుల కోసం పోటీ పడుతుంటారు. వారిలో ఎవరి పరపతి, ఒత్తిడి ఎక్కువగా ఉంటే నిధులు వచ్చినప్పుడు వాటిలో కొంత వారికి కేటాయించడం సహజం. కనుక ఈ లెక్కన వచ్చే ఎన్నికల నాటికైనా రాష్ట్రంలో రోడ్లన్నీ బాగుచేయగలరా? అంటే అనుమానమే.



