చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలు ఉండాలంటూ అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో జరుగుతున్న రచ్చ తెలియనిది కాదు. ఇది ఇప్పట్లో ఓ కొలిక్కి వస్తుందో లేదో గానీ, మీడియా మీట్ లో పాల్గొంటున్న పేర్ని నాని మాత్రం తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.
జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆనాడు పేర్ని నాని మీడియాకు వివరించగా, నేడు అదే మీడియా పేర్ని నాని గారిని పలు ప్రశ్నలు వేసింది. “చిన్న, పెద్ద సినిమాలలో లేని తేడాలు స్కూల్స్, కాలేజీలు, ఆసుపత్రిలలో ఎందుకు ఉంటున్నాయి?” అని మీడియా ప్రశ్నించడంతో అవాక్కయిన నాని, సీఎం గారిని లైన్ లోకి తీసుకొచ్చారు.
Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?
“సినిమాటోగ్రఫీ శాఖ స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది, ఆయనకి – ఇండస్ట్రీకి మధ్య వారధిలా మాత్రమే తాను ఉన్నానని, మీరు అడిగిన మాటను ముఖ్యమంత్రి దగ్గర చెప్తానని” ఒక విధంగా మీడియా నుండి తప్పించుకున్నారు పేర్ని నాని. దీంతో సినిమా ఇండస్ట్రీపై ఏ నిర్ణయమైనా అది సీఎం జగన్ పరిధిలో మాత్రమే ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.
దీంతో ఈ సారి ముఖ్యమంత్రి గారు ఎక్కడ తారసపడినా మీడియా నుండి వచ్చే మొదటి ప్రశ్నే ఇదే కావచ్చు. సాధారణంగా మీడియా కంట పడని జగన్ గారు, పరిస్థితిని సర్దుబాటు చేసిన తర్వాత గానీ ప్రెస్ మీట్ నిర్వహించరేమో! అన్న టాక్ కూడా వినపడుతోంది. ఒక విధంగా సీఎంను ఇరికించి, పేర్ని నాని ఇండస్ట్రీకి మంచే చేసారులే అని గుసగుసలాడుకోవడం మీడియా వర్గాల వంతయ్యింది.