harish-rao-in-phone-tapping-case

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ పార్టీ నేతల అరెస్టులు మొదలవబోతున్నాయా? అంటే అవుననే అనుకోవాలసి ఉంటుంది. మాజీ సాగునీటి, ఆర్ధిక శాఖల మంత్రి హరీష్ రావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఈరోజు కేసు నమోదైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటకే చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఈ పిర్యాదు చేశారు.

నాడు తన ఫోన్ ట్యాపింగ్ చేసి హరీష్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీజీ రాధాకిషన్ రావు తనను చాలా వేధించారని చక్రధర్ తన పిర్యాదులో పేర్కొన్నారు. ఆయన పిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు హరీష్ రావు, రాధాకిషన్ రావులపై ఐటి చట్టంలోని సెక్షన్స్ 120 (బి), 386, 409, 506 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. నేడో రేపో వారిరువురికీ విచారణకు హాజరుకావలంటూ నోటీసులు పంపించనున్నారు.

Also Read – జీఎస్టీ ఆదాయం తగ్గితే.. సిగ్గు పడాల్సింది బాబు కాదు.. జగనే!

ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్‌లని జూబ్లీహిల్స్‌ ఏసీపీ ప్రశ్నించారు. ఇప్పుడు హరీష్ రావుకి నోటీస్ ఇవ్వబోతుండటం చూస్తే, ఇకపై బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలపై కూడా కేసులు నమోదు చేసి నోటీసులు పంపడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఈ ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మాజీ ఇంటలిజన్స్ చీఫ్ ప్రభాకర్ రావు గత ఏడాది కాలంగా అమెరికాలో ఉంటున్నారు. వైద్య చికిత్స కోసమని వెళ్ళిన ఆయన చికిత్స పూర్తికాగానే హైదరాబాద్‌ తిరిగివద్దామనే అనుకున్నారు.

Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?


కానీ తనపై రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవడంతో, ఇటీవలే ఆయన తనను ‘రాజకీయ శరణార్ధి’గా ఆశ్రయం కల్పించమని కోరుతూ అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు ఇప్పటికే ‘గ్రీన్ కార్డ్ ‘ ఉంది. కనుక అమెరికా నుంచి ఆయనని రప్పించడానికి తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆయన కోసం ఎదురుచూస్తూ ‘పుణ్యకాలం’ వృధా చేయడం కంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణని వేగవంతం చేయడమే మంచిదని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఉండవచ్చు.
బహుశః అందువల్లే హరీష్ రావుతో ప్రారంభించారేమో?
కానీ ఇన్నాళ్ళూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌ని లోపల వేస్తామని చెప్పిన కాంగ్రెస్ మంత్రులు ఆకస్మికంగా హరీష్ రావుపై కేసు నమోదు చేయించడం ఆలోచింపజేస్తోంది.
హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా టాపింగ్ చేయించారనే ఆరోపణలు ఉన్నందున ఇది చాలా తీవ్రమైన కేసు. కనుక ఈ కేసుతో హరేష్ రావుపై ఒత్తిడి పెంచి బిఆర్ఎస్ పార్టీని నిలువునా చీల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ప్లాన్ చేస్తోందేమో? ఈ అనుమానం నిజమో కాదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.