ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ లో విభజన కారణంగా అనేక ఇబ్బందులకు గురి అవుతున్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఎన్నికల వేళ కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని ఆకట్టుకోవడానికైనా కొన్ని నిధులు ఇస్తారని అందరూ భావించినా అటువంటిది ఏమీ లేదు. ఈ బడ్జెట్ ను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు నిరశించారు. అయితే బీజేపీ మాత్రం ఈ బడ్జెట్ ను ఆకాశానికి ఎత్తుతుంది
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఇవ్వకపోయినా దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టిన వివిధ స్కీంల వల్ల ఇక్కడి ప్రజలకు విశేషంగా లాభిస్తుంది అని వారి వాదన. అయితే ఇది ఎంత వరకు నిజమని అని పరిశీలిస్తే ఒక్క ఉదాహరణ చూడాలి. అమరావతి – ఎర్రుపాలెం మధ్య నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ గురించి దక్షిణ మధ్య రైల్వే సర్వే నిర్వహించింది. ఈ రైల్వే లైన్ కు 2700 కోట్లు కావాల్సి వస్తుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన సర్వే, ప్రాజెక్టు డీపీఆర్ రైల్వే శాఖకు పంపింది.
బడ్జెట్ లో ఇంత కీలకమైన ప్రాజెక్ట్ కు కేంద్రం ఎంత కేటాయించిందో తెలిస్తే ఒక్కసారిగా విస్తు పోతారు. 2700 కోట్ల ఈ ప్రాజెక్టుకు కేవలం కేంద్రం కేటాయించింది 10 లక్షలు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు 10 లక్షలు కేటాయించడం అంటే బహుశా పనులకు సంబంధించిన నట్లు, బోల్టులకు కూడా సరిపోదేమో. మరి కేంద్ర ప్రభుత్వం గానీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు గానీ దీనిని ఎలా సమర్ధించుకుంటారో చూడాలి. బీజేపీ మాములుగా అవినీతి వల్ల నిధులు ఇవ్వడం లేదంటారు. ఇది పూర్తిగా కేంద్రప్రభుత్వ ప్రాజెక్టు.
ప్రాజెక్టు సర్వే, డీపీఆర్ నుండి ప్రాజెక్టు నిర్మాణం వరకూ అంతా కేంద్రమే చేపడుతుంది. కాంట్రాక్టు కూడా కేంద్రమే ఖరారు చేస్తుంది. మరి దీనికి ఏమని సమాధానం చెప్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే 2017 జులైలో పూర్తి అయ్యింది. అమరావతికి రైల్వే కనెక్టివిటీ పెంచడానికి ఇది చాలా కీలకమైన ప్రాజెక్టు. అయితే ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం వివక్షకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రానికి సంబంధించిన అన్ని కీలకమైన ప్రాజెక్టులకు పోలవరంతో సహా కేంద్రం వైఖరి ఇంతే.



