పోలవరం ప్రాజెక్టు టెండర్‌ని రద్దు చేసి మళ్లీ పిలవడం (రీ టెండరింగ్) వల్ల నష్టమే తప్ప, లాభమేమీ ఉండబోదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పేర్కొంది. రీ టెండరింగ్‌కు వెళ్లడం వల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు, ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని, నిర్మాణ గడువు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. అదే సందర్భంగా ఇప్పుడు తీసేసిన కాంట్రాక్టర్, నవయుగ పనితీరు కూడా బాగానే ఉందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభిప్రాయపడింది.
ట్రాన్స్‌ట్రాయ్ నుంచి నవయుగకు పనులు మార్చినప్పుడు… మూడు నెలల సమయం వృథా అయిందని, ఇప్పుడు మరో 3 నెలలు వృథా అయితే ఒక సీజన్ పోతుందని పీపీఏ పేర్కొంది. జాప్యం వల్ల పడే ఆర్థిక భారానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రీ టెండరింగ్ పై మొండిగా ఉండటంతో దాని లాభనష్టాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని పీపీఏ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా సాక్షి దీని మీద ప్రచురించిన కథనం ఆసక్తికరంగా ఉంది.
‘టెండర్ల రద్దుతో నష్టమే’ అని ఈనాడు, ‘ఎందుకీ రివర్స్?’ అని ఆంధ్రజ్యోతి, ‘రివర్స్ టెండరింగ్ తో భారం, జాప్యం’ అని ఆంధ్రప్రభ, ‘రివర్స్ టెండరింగ్ నష్టమే’ అని ఆంధ్రభూమి, ‘రివర్స్ సరికాదు’ అని ప్రజాశక్తి ఈ వార్తకు హెడ్ లైన్ పెట్టగా సాక్షి మాత్రం ‘రివర్స్ టెండరింగ్’ కు గ్రీన్ సిగ్నల్ అని పూర్తిగా పాజిటివ్ గా ఒక ఆర్టికల్ వండి వార్చింది. తన పాఠకులను ఏ మార్చే ప్రయత్నం చేసింది. అయితే సాక్షికి ఇదంతా షరా మాములే అని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆక్షేపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ విడుదల చేసిన ప్రెస్ నోట్ తో సహా సాక్షి అబద్దాలను బయటపెట్టారు.



