కేసీఆర్‌ ఓడినా తెలంగాణలో ఉండగలుగుతున్నారు కానీ…

Chandrababu-Naidu-KCR-Jagan-Revanth-Reddy

ఏపీ, తెలంగాణ రాజకీయాలలో అనేక వైరుధ్యాలు, అనేక పోలికలు కనిపిస్తుంటాయి. వైరుద్యాల విషయానికి వస్తే, తెలంగాణలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించిన మాట వాస్తవం. ప్రతిపక్షాలను స్వేచ్చగా తిరగనీయకుండా చేసిన మాట కూడా వాస్తవమే.

అయితే తనకు ప్రమాదమనుకున్న చంద్రబాబు నాయుడుని, రేవంత్‌ రెడ్డిని రాజకీయంగా చావు దెబ్బతీయడానికి కేసీఆర్‌ ఎన్నడూ వెనకాడలేదు. అందుకు వారు ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. అది వేరే సంగతి.

ADVERTISEMENT

కానీ కేసీఆర్‌ ఎంత నియంతృత్వం ప్రదర్శించినా, ప్రతిపక్షాల పట్ల చులకనగా మాట్లాడినా వారిపై రాజకీయ కక్ష సాధింపులకు పూనుకోలేదు. పూనుకొని ఉంటే నేడు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సహా చాలా మంది కాంగ్రెస్‌ నేతలు జైల్లో ఉండేవారని కేసీఆర్‌ స్వయంగా చెప్పారు.

కేసీఆర్‌ ఆనాడు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదు కనుకనే ఎన్నికలలో ఓడిపోయినా నేడు తెలంగాణలో ఉండగలుగుతున్నారు. స్వేచ్ఛగా తిరగ గలుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ పోటీ పడుతున్నారు కూడా.

కానీ ఆయన ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ఆలోచన చేయడం మొదలుపెట్టగానే, రేవంత్‌ రెడ్డి కూడా బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాదని వ్యవహరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేందుకే ఇదే ఓ చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

తెలంగాణతో పోలిస్తే ఏపీలో ‘వైసీపి రాజకీయాలు’ పూర్తి భిన్నంగా సాగాయి. చంద్రబాబు నాయుడుతో సహా టిడిపిలో అందరినీ జగన్‌ వేధిస్తూనే ఉన్నారు. అచ్చన్నాయుడు మొదలు చంద్రబాబు నాయుడు వరకు అందరిపై కేసులు నమోదు చేయిస్తూనే ఉన్నారు. చివరికి చంద్రబాబు నాయుడుని జైల్లో కూడా పెట్టించారు.

పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకుగాను ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి ఆయనను ఎంతగా అవహేళన చేశారో, ఎంత అనుచితంగా మాట్లాడారో అందరూ విన్నారు.

టిడిపి నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై వైసీపి భౌతిక దాడులు, పోసాని, వర్మ, అంబటి, రోజా, తాజాగా ముద్రగడ, మహాసేన రాజేష్ వంటి వారితో వారి గురించి చులకనగా మాట్లాడిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

టిడిపి, జనసేనలను దెబ్బ తీసేందుకు సినిమాలు తీయించడం, ఆ రెండు పార్టీలతో సంబంధాలున్నందుకు సినీ పరిశ్రమని వేధించడం ఇలా… ఒకటేమిటి చాలానే ఉన్నాయి.

కనుక టిడిపి, జనసేనలు కూడా వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి, ఆ పార్టీ నేతలపై ప్రతీకారంతో రగిలిపోతున్నారు. నారా లోకేష్‌ అయితే ఎర్రడెయిరీ చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. కనుక ఒకవేళ శాసనసభ ఎన్నికలలో వైసీపి ఓడిపోతే ఎవరూ రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి ఏర్పడవచ్చు.

ఒకవేళ టిడిపి, జనసేనలు ఓడిపోయినా జగన్మోహన్‌ రెడ్డి వాటి అంతు చూడకుండా విడిచిపెట్టరు. కనుక టిడిపి, జనసేన నేతలకు కూడా ఇటువంటి ప్రమాదమే పొంచి ఉందని చెప్పవచ్చు.

ఎన్నికలలో ఓడిపోతే రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి ఎందుకు కలిగిందంటే, పాలకులు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండకపోవడం వలననే. పాలకులు, అధికారులు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలనుకోకపోవడం వలననే అని చెప్పక తప్పదు.

ధర్మో రక్షతి రక్షితః అన్నట్లు పాలకులు ప్రజాస్వామ్యానికి కట్టుబడి దానిని గౌరవిస్తూ కాపాడుకుంటే అదే వారిని కాపాడుతుంది. కానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో రాజకీయ నేతల దుస్థితే నిరూపించి చూపబోతోంది.

ADVERTISEMENT
Latest Stories