ఇదివరకు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు విడుదలైనప్పుడు ఏపీలో ఎటువంటి నీచ రాజకీయాలు జరిగాయో అందరూ చూశారు. ఇప్పుడు పుష్ప-2 విడుదలైనప్పుడు కూడా రాజకీయాలు సాగుతున్నాయి.
ఎటువంటి రాజకీయ ఇబ్బందులు వద్దనే సినీ పరిశ్రమలో చాలా మంది రాజకీయాలకు దూరంగా ఉంటారు. అయినప్పటికీ ఎప్పుడో అప్పుడు ఏదో సందర్భంలో రాజకీయ బురద అంటుకుంటుంది. అది అంత సులువుగా వదలదని పుష్ప-2 చుట్టూ జరగుతున్న రాజకీయాలు నిరూపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఆ సినిమాకి మద్దతుగా, వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం, థియేటర్ల వద్ద వైసీపీ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టడం వంటివి ఇందుకు నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి. అలాగే పుష్ప-2లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లను కించపరిచేలా అల్లు అర్జున్ డైలాగ్స్ ఉన్నాయంటూ జరిగిన దుష్ప్రచారం చూసినప్పుడు, ఇప్పుడు సినిమాలకు కూడా రాజకీయ బెడద తప్పదని అర్దమవుతుంది.
హైదరాబాద్, సంధ్య థియేటర్ వద్ద త్రొక్కిసలాటలో ఓ మహిళా మృతి చెందడం, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం చాలా దూరదృష్టకరమే. కానీ ఆ విషాద ఘటనపై కూడా నీచ రాజకీయాలు జరుగుతుండటం చాలా బాధాకరం.
తన కుమారుడు బ్రతికే ఉన్నాడని కానీ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారని ఆ బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విదంగా ఎవరు ఎందుకు చేస్తున్నారో కానీ అది ఖచ్చితంగా పైశాచిక ఆనందమే కదా?
ఈ విషాద ఘటనపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి వారి కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించారు. వారి వైద్య ఖర్చులను పూర్తిగా తాను భరిస్తానని, వారి కుటుంబానికి ఎటువంటి సాయం కావాలన్నా తప్పకుండా చేస్తానంటూ వీడియో మెసేజ్ పెట్టారు. దానిపై కూడా రాజకీయాలు జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఏపీలో పుష్ప-2 ప్రదర్శించబడుతున్న కొన్ని థియేటర్లను రెవెన్యూ అధికారులు మూయించేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయా సినిమా థియేటర్లకు లైసెన్సులు రెన్యువల్ చేయించుకోలేదనో మరో కారణంతోనో సినిమా ప్రదర్శన జరుగుతుండగా నిలిపించేసి మరీ థియేటర్లకు తాళాలు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇవి నిజమే అయితే కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవే.
అభిమానుల కోసం ప్రత్యేక షోల ప్రదర్శనకు అనుమతించి టికెట్ ధరల పెంపుకు ఆమోదం తెలిపి కూటమి ప్రభుత్వం చాలా హుందాగా వ్యవహరించింది. కనుక ఒకవేళ పుష్ప-2 విషయంలో ఈవిదంగా జరుగుతున్నట్లయితే సిఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెంటనే స్పందించి పుష్ప-2 ప్రదర్శనకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకుంటే అందరూ హర్షిస్తారు.
ఏది ఏమైనప్పటికీ పుష్ప-2తో అనేక కొత్త విషయాలు, కొత్త రకం రాజకీయాలు బయటపడ్డాయి. కనుక ఇకపై దర్శక నిర్మాతలు, నటీనటులు, ప్రభుత్వాలు, పోలీసులు అందరూ కూడా వీటి నుండి పాఠాలు నేర్చుకోవడం అవసరమే.




