విడుదలకు సిద్ధంగా ఉన్న “దువ్వాడ జగన్నాధమ్” చిత్ర ప్రమోషన్స్ లో యూనిట్ బిజీగా ఉండగా, అందులో భాగంగా హీరోయిన్ పూజా హెగ్డే కూడా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ హంగామా చేస్తోంది. అయితే పూజాకు సంబంధించి ఇటీవల ఓ వార్త ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ప్రిన్స్ మహేష్ బాబు 25వ సినిమాలో పూజా హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందనే ప్రచారం భారీ స్థాయిలో జరిగింది.
దీనిపై స్పష్టత ఇవ్వాల్సిందిగా మీడియా వర్గాలు పూజను కోరగా, ‘ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై స్పందించే స్థితిలో తాను లేనని’ చెప్పింది. ఈ సినిమాను ఒప్పుకున్నానని గానీ, ఒప్పుకోలేదని గానీ చెప్పలేదంటే… చర్చలు అయితే జరుగుతున్నట్లు స్పష్టమైంది. అయితే పూజ నటించిన సినిమాలేవీ పెద్దగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ బావుట ఎగురవేయలేదు గనుక, “డీజే” ఫలితం చూసిన తర్వాత ఫైనల్ చేస్తారేమో అన్న టాక్ వినపడుతోంది.
మరో వైపు… ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది గనుక, ఇప్పటి నుండే ప్రచారం చేయడం ఇష్టం లేకనే ఈ ముద్దుగుమ్మ సైలెంట్ గా ఉందని వినికిడి. బహుశా చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లినో లేక నిర్మాత దిల్ రాజు గానీ పూజా హెగ్డే సమాచారాన్ని అధికారికంగా వెల్లడించవచ్చని సినీ జనాల టాక్. “డీజే” ఆశించిన ఫలితం ఇస్తే గనుక టాలీవుడ్ లో చక్రం తిప్పే హీరోయిన్ గా పూజా అవతరిస్తుందేమో!



