నాగచైతన్యతో ‘ఒక లైలా కోసం’ సినిమాలో నటించిన పూజా హెగ్డే, అంతకుముందు వరుణ్ తేజ్ తో ‘ముకుంద,’ ఆ తర్వాత అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమాలను చేసి మెగా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు విడుదలైన రెండు సినిమాలు మిశ్రమ ఫలితాలను ఎదుర్కోవడంతో… మూడవ సినిమా ‘దువ్వాడ జగన్నాధమ్’ రిజల్ట్ పైనే పూజా కెరీర్ ఆధారపడి ఉంటుందనేది ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వచ్చే వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితం కంటే, ముందుగానే ఓ బంపర్ ఆఫర్ పూజా తలుపు తట్టిందనేది లేటెస్ట్ అండ్ హాట్ న్యూస్.
అవును… ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం పూజాను వరించింది అనేది అసలు విషయం. అది కూడా మహేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా మారిన 25వ సినిమా కావడం మరింత ప్రాధాన్యతను దక్కించుకుంది. ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది తొలినాళ్ళల్లో గానీ సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు మరియు అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్నదే కావడం విశేషం.



