కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీని నేడో రేపో నియమిస్తారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో… రాహుల్ ను పక్కన పెట్టి, అదే పదవిలో ప్రియాంకా గాంధీని కూర్చోబెడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సోనియా వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కొందరు సీనియర్ నేతల వద్ద సోనియా స్వయంగా ప్రస్తావించినట్లుగా సమాచారం.
క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కాగా… మన్మోహన్ సింగ్ తదితర పెద్దల ముందు సోనియా స్వయంగా ప్రియాంకా పేరు లేవనెత్తినట్టు తెలుస్తోంది. ప్రియాంక ప్రస్తావన ఆమె నోటి నుంచి రాగా, సీనియర్ నేతలు అశ్చర్యపోయారని, తుది నిర్ణయం తీసుకోకున్నా, రాహుల్ కన్నా ప్రియాంకా గాంధీ అయితే, పార్టీకి మేలు కలుగుతుందన్న అభిప్రాయం సోనియాలో వ్యక్తమైందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇక పార్టీ కార్యకలాపాల నుంచి తప్పుకోవాలని చాలా కాలంగా భావిస్తున్న సోనియా, మరో ఒకటి రెండు నెలల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రియాంక ప్రస్తావనను ఆమె మామూలుగానే తీసుకొచ్చారని, ఆమె మనసులో మాత్రం ఏదో బలంగానే ఉందని తమకు అనిపించిందని, ఈ ఎత్తుగడ వెనుక ఎంతో ఆలోచనను ఆమె చేసి వుండవచ్చని ఓ సీడబ్ల్యూసీ సభ్యుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నో సంవత్సరాలుగా ప్రియాంకకు పార్టీలో కీలక పదవిని కట్టబెట్టాలని పార్టీలో డిమాండ్ ఉన్న మాట వాస్తవమే.


