54 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు ఒక తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వరించింది. 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ‘పుష్ప’ సినిమాలో నటించిన అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు తో పాటు మెుత్తంగా తెలుగు సినిమాకు సంబందించి 11 అవార్డులు లభించడంతో తెలుగు ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. 1967లో ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం మెుదలు పెట్టాక 54 సంవత్సరాలకు తొలిసారి తెలుగు నటుడికి ఈ అవార్డు లభించడంతో అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. అల్లు అర్జున్ సాధించిన ఘనతను తెలుగు సినీ, రాజకీయ ప్రముఖలు మనస్పూర్తిగా అభినందించారు. తెలుగు మీడియా పతాక శీర్షికల్లో ప్రచురించింది.
యన్టీఆర్, ఏయన్నార్, యస్వీఆర్, గుమ్మడి, వంటి అనేక మేటి నటులతో పాటు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి పాప్యులర్ నటులు అనేక మందిని అందించిన తెలుగు సినిమాకు, వారెవ్వరూ సాధించని ఘనత ఇప్పటి బన్నీ సాదించడం గొప్ప విషయం. వారి కంటే బన్నీ గొప్ప నటుడా, ఇందులో అంత గొప్పగా నటించాడా అని వచ్చే విమర్శలు పక్కన పెడితే, ఇది తెలుగువారందరూ గర్వపడే సమయం. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవలసిన మరొక విషయం కూడా ఉంది, అదే ఆంధ్ర ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డులు.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు నంది అవార్డుల పేరుతో 1964 నుండి తెలుగు సినిమాకు చెందిన వివిధ విభాగాలకు, నటి నటులకు అవార్డులు ఇచ్చేవారు. ఎప్పుడైనా ఆలస్యం జరిగినా కూడా ఈ ఆనవాయితీ రాష్ట్రం విడిపోయే ముందు వరకు కొనసాగింది.2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అక్కడి ప్రభుత్వం ఈ అవార్డులు నిలిపివేసింది. ‘సింహ’ అంటూ మరొక అవార్డు ఇస్తాం అంటూ కొన్ని సందర్భాల్లో లీకులు ఇచ్చినా, పెద్ద సినిమాలకు బెనెఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులివ్వడమే సినిమా పరిశ్రమకు పెద్ద గుర్తింపు అనే విధంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇక ఇటు ఆంధ్రలో అప్పటి ప్రభుత్వం కూడా తెలుగు సినిమా పరిశ్రమ అంతా తెలంగాణలో ఉండిపోవడం, షూటింగులు కూడా 90% పైన ఆంధ్రకు బయటే జరగటం, ఆంధ్ర కేవలం డిస్ట్రిబ్యూషన్, ఎక్సిబిషన్ వరకే పరిమితం కావడంతో నంది అవార్డులు ఇక్కడి ప్రభుత్వం తరపున ఇవ్వాలా వద్దా అని ఆచి తూచి తెలంగాణ ప్రభుత్వం నుండి ఎటువంటి కదలిక లేకపోవటంతో చివరకు ఆంధ్ర తరపునే ఇవ్వడానికి నిర్ణయించి, తెలుగు సినిమా పరిశ్రమ నుంచి సీనియర్ నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులైన మురళీమెూహన్, అల్లు అరవింద్, కే యస్ రామారావు, అంబికా కృష్ణ, వరప్రసాద్ రెడ్డి, గిరిబాబు, జీవిత, అర్జునరాజు వంటి అనుభవజ్ఞులతో కూడిన కమిటీలు 2014, 2015, 2016 సంవత్సరాలకు ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలు 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులుకు సంబంధించిన వివిధ విభాగాలకు, అలాగే యన్టీఆర్ జాతీయ అవార్డు, రఘపతి వెంకయ్య అవార్డు, బియన్ రెడ్డి అవార్డు, చక్రపాణి-నాగిరెడ్డి అవార్డులకు ఎంపికైన వారిని 2017 లో ప్రకటించింది. వాటిని చూస్తే రఘపతి వెంకయ్య అవార్డు చిరంజీవి, కృష్ణంరాజు, ఈశ్వర్ లకు, కమలహాసన్, రజనీకాంత్, రాఘవేంద్రరావులకు యన్టీఆర్ అవార్డు, చక్రపాణి-నాగిరెడ్డి అవార్డ్ నారాయణమూర్తి, కీరవాణి, కేయస్ రామారావు, బియన్ రెడ్డి అవార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, స్పెషల్ జ్యూరీ అవార్డ్ సుద్దాల అశోక్ తేజ, పిసి రెడ్డి, ఇలా దాదాపు ప్రతిభ, అనుభవం, సక్సెస్ వంటి వాటి ఆధారంగానే ఎంపిక జరిగింది.
ఇక ఇవ్వరనుకున్న అవార్డులు మూడేళ్ళ తరువాత ఒక ప్రభుత్వం చొరవ తీసుకుని ముందుకువచ్చి ప్రకటించినందుకు సాధారణంగా సినిమా పరిశ్రమ చాలా ఆనందపడి ఉండాలి. కానీ విచిత్రంగా మా సినిమాకు ఎందుకు దక్కలేదు, పక్క సినిమాకు అర్హత లేదు అంటూ తెలుగు పరిశ్రమ నుంచే అసంతృప్త స్వరాలు మెుదలు పెట్టారు. ఇక అప్పటి నుంచే వైసిపికి అనుబంధంగా వ్యవహరిస్తారనే పేరున్న దర్శకుడు ఆర్జీవి ఐతే మరో అడుగు ముందుకు వేసి పాత సినిమాలో పాటను ఒక కులంతో ముడిపెట్టి రీమిక్స్ చేసి మరీ తన స్ధాయి ఎంతకు దిగజారిందో చెప్పుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, కమిటీలో ఉన్న అల్లు అరవింద్ కాంపౌండ్ మనిషి, బన్నీ కాంప్ లో ముఖ్యుడు, నిర్మాత బన్నీవాస్ ప్రెస్ మీట్ పెట్టి మరీ అవార్డులు కుల ప్రాతిపధికన ఇచ్చారనే విధంగా ఆరోపణలు చేసారు. మెగా హీరోలు తెలుగుదేశం ప్రభుత్వం వద్ద నటన నేర్చుకోవలసిన అవసరంలేదు, ఈ మూడేళ్ళలో వాళ్లు మంచి సినిమాలే చెయ్యలేదా, ఒక వర్గానికి అన్యాయం జరిగిందనే విధంగా ఆరోపించారు. మామూలుగా ఐతే బన్నీవాసు లాంటి చిన్న వ్యక్తుల వ్యాఖ్యలకు పెద్ద ప్రాధాన్యం లేదు, కానీ అతనికి అల్లు అర్జున్ అంతరంగీకుడని పేరు, అరవింద్ కుటుంబం భాగస్వామిగా ఉన్న జిఏ-2 బ్యానర్‌లో పార్టనర్. బన్నీ వాస్ అంటే అర్జున్ చెప్పినట్టే, అర్జున్ చెబితే అరవింద్ చెప్పినట్టే భావిస్తారు అందరూ. ఆ కమిటీలో ఉన్న అరవింద్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. ఆ అవార్డుల్లో కొన్ని ఒక వర్గం నటులకు వచ్చినంత మాత్రాన కులానికి ముడిపెట్టి ఆరోపణలు చెయ్యడం అదే మెుదటిసారి. వీటిని మెగా కాంపౌండ్ నుంచి గానీ, అల్లు కాంపౌండ్ నుంచి గానీ ఎవరూ ఖండించలేదు. దాంతో బన్నీవాస్ వ్యాఖ్యల వెనుక వారు ఉన్నారనే భావన ప్రజల్లో వచ్చింది. ఈ పరిణామాలతో మంచికి పోతే చెడు ఎదురైన చందంగా అప్పటి ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల ఫంక్షన్ కూడా జరపలేదు, ఆ తరువాత అసలు ఆ అవార్డులే ఇవ్వలేదు. ఇక 2019 తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం అయితే సినీ పరిశ్రమతో ఫుట్ బాలే ఆడుకుంది. ఏ కాంప్ హీరోల కోసం బన్నీ వాస్ విమర్శలు చేసాడో అదే కాంపౌండ్ పెద్ద చిరంజీవి చేతులు జోడించి ప్రాధేయపడేట్టు చేసింది. ఇప్పుడు కనీసం ఆ అవార్డుల ప్రస్తావన తెచ్చే ధైర్యం కూడా పరిశ్రమ నుండి ఎవరూ చెయ్యడం లేదు.
ఇప్పుడు ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు లభించిన వాటిలో దాదాపు అన్ని మెగా కాంపౌండ్ పాత్ర ఉన్న సినిమాలకే వచ్చాయి. ఇప్పుడు బన్నీవాస్, ఆర్జీవి, గుణశేఖర్ వంటి వారు అప్పుడు చేసినట్టు ఆరోపణలు చేస్తే వారు అంగీకరిస్తారా? ఇప్పుడు కూడా రాజకీయ అవసరాలకోసం కేంద్రంలో ఒక పార్టీ వీరికి అవార్డులు ఇచ్చిందని, అల్లు కుటుంబానికి చెందిన రాబోయే ఒక పాన్ ఇండియా సినిమా కోసం లాభీ జరిగిందని, ఒక కులం ఓట్ల కోసం అంటూ సోషల్ మీడియాల్లో అనేక వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అప్పుడు బన్నీవాస్ వంటి వారు చేసిన ఆరోపణలు నిజం ఐతే ఇప్పుడు వీటిని నిజం అనే ఒప్పుకోవాలి కదా? జై భీం వంటి అనేక మంచి సామాజిక స్పృహ ఉన్న సినిమాలు, వాటిలో నటించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న నటులు ఉండగా స్మగ్లింగ్, హత్యలు, చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేసే కథకు నాయకుడిగా నటించిన పాత్రకు రావడంపైనే అనేక విమర్శలు వచ్చాయి. అస్కార్ గుర్తించిన RRR సంగీతాన్ని కూడా జాతీయ అవార్డుల కమిటీ పక్కన పెట్టింది. కొన్ని మీడియాలకు ఇంటర్వ్యూ ఇస్తూ అల్లు అర్జున్ కూడా “సాధారణంగా అవార్డు ఇచ్చే సమయంలో పాత్రకు నటుడు న్యాయం చేసాడా లేదా అని చూస్తారు తప్ప ఇతర విషయాలు చూడరు” అనే విధంగా చెప్పారు. బహుశా ఈ విషయం అప్పట్లో తన స్నేహితుడు బన్నీవాస్ కు కూడా చెప్పి ఉంటే అతని ఆలోచన మార్చుకునే వాడేమెూ. ఇలా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం మెుదలు పెట్టిన పనిని బన్నివాస్ వంటి వారి అత్యుత్సాహం, ఇతరకారణాల వల్ల మూలపడటం దురదృష్టకరం. కనీసం ఇప్పుడన్నా ఇటువంటి వారు ఆనాడు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకుంటే తెలుగు సినిమా పరిశ్రమ వరకు అస్కార్ వంటి నంది అవార్డులను ఇచ్చే ప్రక్రియ భవిష్యత్తులో తిరిగి మెదలు పెట్టే అవకాశం ఉంటుందేమెూ!



