రాజకీయాల గురించి విశ్లేషించడానికి, వాటి మంచి చెడుల గురించి అవగాహనకు రావడానికి ప్రొఫెసరే అవ్వనవసరం లేదు ఒక సాధారణ గృహిణి సరిపోతుంది అని రుజువు చేసారు మేధావిగా చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు.
ఒకప్పుడు కమ్యూనిస్ట్ భావజాలంతో పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు కాస్త దగ్గరగా, బీజేపీ సిద్ధాంతాలకు కిలోమీటర్ దూరంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన రాజకీయ విశ్లేషణలు వినిపించేవారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో కమ్యూనిజం కనుమరుగు కావడంతో తన విశ్లేషణలు కాసుల మయమయ్యాయా..? అనేవిధంగా నాగేశ్వరరావు ఒక ప్రొఫెసర్ స్థాయి నుంచి ఒక పార్టీ కార్యకర్త స్థాయికి దిగజారి ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఈ మేధావి పై విమర్శల జడివానే కురుస్తుంది.
విషయానికి వస్తే.., గత కొన్ని రోజుల నుండి ఏపీ లో జరుగుతున్నఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామ్య విధానాలను ఎండగడుతున్న టీడీపీ, జనసేన లు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన, పట్టాదారు పాసు పుస్తకాల మీద జగన్ బొమ్మ ముద్రణ పై అధికార పార్టీని నిలదీస్తున్నారు. మా ఆస్తుల మీద మీ బొమ్మ ఎందుకు..? మా ఆస్తుల మీద మీ హక్కు ఏంటి..? అనే ప్రతిపక్షాల నినాదాలు ప్రజలలోకి బలంగా చొచ్చుకెళ్లాయి.
దీని ఫలితమే పులివెందులలో భారతి రెడ్డికి ఎదురైనా చేదు అనుభవం. అయితే ఈ నినాదాలు ప్రజలలో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకతను సృష్టిస్తున్నాయని గ్రహించి మేధావి ముసుగులో ఉన్న కొందరు నీలిరంగు విశ్లేషకులు జగన్ విధానాలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో వాలిపోయి టీడీపీ, జనసేన విమర్శలను తప్పుబడుతూ ఇంటర్ వ్యూ లు ఇస్తున్నారు. మున్సిపల్ ఆఫీసులో ఇచ్చే బర్త్ సెర్టిఫికెట్, డెత్ సెర్టిఫికెట్ చెలామణిలోకి రావాలంటే సంబంధిత అధికారి సంతకం అవసరం.
నా ఇంట్లో బిడ్డ పుడితే దానికి నీ సంతకం ఏమిటి..? అంటూ ఆ అధికారిని ప్రశ్నిస్తామా..? లేక మా ఇంట్లో చావుకు మీ అధికార ముద్ర అవసరమా అంటూ మునిపల్ అధికారి పై విమర్శలు చేస్తామా..? అంటూ వ్యవస్థలకు, వ్యక్తికీ తేడా తెలియని ఒక వైసీపీ కార్యకర్త మాదిరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని తప్పుపట్టని ఈ ప్రతిపక్ష నాయకులు వీటినెలా తప్పుపడతారు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రొఫెసర్.
మున్సిపల్ కార్యాలయం అనేది ఒక ప్రభుత్వ వ్యవస్థ, అందులో పని చేసే అధికారి కాలపరిమితి సుమారు కొన్నేళ్లపాటు కొనసాగుతుంది. ముఖ్యమంత్రులు మారిన ఆ వ్యవస్థలో అందులో పని చేసే వ్యక్తుల పని తీరులో కానీ వారి అధికారం లో కానీ ఎటువంటి మార్పు ఉండదు. కానీ జగన్ అనే వాడు ఒక వ్యక్తి మాత్రమే, ఈ రోజు ముఖ్యమంత్రి గా ఉన్న జగన్ రేపు ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమంత్రిగానే కొనసాగుతాడనే గ్యారెంటీ ఈ విశ్లేషకుడు ఇవ్వగలరా..?
ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకుంటూ, పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రుల బొమ్మలు మారుస్తూ ఇక ప్రజాపాలన ఎలా చేస్తారు..? ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజల ఆస్తి పత్రాలు మారతాయా..? అలా అయితే దేశానికీ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి, దేశాన్ని నడుపుతున్నది ప్రధాన మంత్రి . రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయి మీద కేంద్ర ప్రభుత్వం మోడీ బొమ్మ వేసి ఇస్తున్నారా..?
లేక కేంద్ర సంస్థల ఆధీనంలో ఉండే పాస్ పోర్ట్, వీసా వంటి పత్రాల మీద ప్రధాని ఫోటోలను కానీ, రాష్ట్రపతి ఫోటోలను కానీ ముద్రిస్తున్నాయా..? అలా ముద్రిస్తే ఈ మేధావి వాటిని సమర్థిస్తారా..? అంటూ సామజిక మాధ్యమాలలో నాగేశ్వరరావు పైన కౌంటర్ల మోత మోగిస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ రాష్ట్రంలో ఓటు హక్కు లేని వారు ఈ రాష్ట్ర రాజకీయాల మీద తమ అభిప్రాయం చెప్పకూడదు, అలా చెపితే వైసీపీ ట్రీట్మెంట్ కు అర్హులు అంటూ పద్మ అవార్డులు తీసుకున్నసెలబ్రెటీలను సైతం వదలని వైసీపీ మరి తెలంగాణలో వాసి అయినా ఈ ప్రొఫెసర్ ను ఎందుకు రంగంలోకి దింపిందో చెప్పగలరా..?
ఒక్క నాగేశ్వరరావు మాత్రమే కాదు ఇలా మేధావి ముసుగు వేసుకుని తెలంగాణలో ఉంటూ ఏపీలో వైసీపీ గెలుపు కోసం పని చేస్తున్న ప్రొఫెసర్లు, సినీ సెలబ్రేటిస్, బిఆర్ఎస్, ఎంఐఎం వంటి రాజకీయ పార్టీలు ఎందరో వైసీపీ కార్యకర్తల మాదిరి మారిపోతున్నారు. మరి ఏపీలో వైసీపీ గెలుపు తెలంగాణకు ఎంత అవసరమో వీరి ఆత్రుత చూస్తే అర్ధమవుతుంది.






