Raghu-Rama-Krishna-Raju-Narasapuram

వైసీపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఇంతకాలం పార్టీలోనే ఉంటూ జగన్మోహన్‌ రెడ్డి, ఆయన ప్రభుత్వంపై చేస్తున్న రాజకీయ, న్యాయ పోరాటాల గురించి అందరికీ తెలుసు. ఆయన టిడిపి, జనసేన, బీజేపీలతో కలిసి మెలిసి ఉన్నప్పటికీ వాటిలో ఏ పార్టీ కూడా ఆయనకు మళ్ళీ నర్సాపురం ఎంపీ టికెట్‌ ఇవ్వలేదు.

ఆయనకు టిడిపి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తుందని ఊహాగానాలు వినిపించాయి కానీ టిడిపి తుది జాబితాలో ఆయన పేరు కనబడలేదు. మూడు పార్టీలు కనీసం ఇందుకు వివరణ కూడా ఇవ్వకపోవడంతో ఆయన చాలా నొచ్చుకున్నారు.

Also Read – దిశా నిర్దేశమంటే ఇది కాదేమో మావయ్య!

ఆయన ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ, “కూటమిలో మూడు పార్టీలు నాకు అన్యాయం చేశాయని భావిస్తున్నాను. ఇంతకాలం నేను వాటి తరపున ప్రజల తరపున జగన్‌ ప్రభుత్వంతో అనేక పోరాటాలు చేశాను. నేను పదవి, అధికారం కోసం తాపత్రయపడేవాడినే అయితే ఇటువంటి ఆలోచన చేయకుండా హాయిగా ఎంపీగా కొనసాగి మళ్ళీ టికెట్‌ సంపాదించుకునేవాడిని.

కానీ జగన్‌ ప్రభుత్వ అరాచకాలను ఎవరో ఒకరు గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందనే నేను ఇన్నేళ్ళుగా పోరాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌ మళ్ళీ గాడిన పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను. కానీ నా పోరాటలన్నీ వృధా అయిపోవడమే కాకుండా అవే నాకు శాపాలుగా మారిన్నట్లున్నాయి.

Also Read – జమిలి బిల్లు సరే… ఆచరణ సాధ్యమేనా?

గత 10-15 రోజులలో మూడు పార్టీలలో కొత్తగా చేరినవారు అనేకమందికి టికెట్లు లభించాయి. కానీ వారిలో ఏ ఒక్కరైనా నాలాగ ధైర్యంగా జగన్మోహన్‌ రెడ్డిని ప్రశ్నించగలిగారా?లేదు. కానీ వారికి టికెట్లు ఇచ్చి నన్ను మూడు పార్టీలు పక్కన పెట్టాయి.

అంటే నేను ఎంచుకున్న మార్గం తప్పా లేదా నేను ఎవరికీ అక్కరలేదా?అనే ప్రశ్న నా మనసుని తొలిచేస్తోంది. ఇటువంటి పరిస్థితులలో ఇంకా నేను రాజకీయాలలో ఉండటం అవసరమా?అనిపిస్తోంది,” అంటూ రఘురామ కృష్ణరాజు తన మనసులో ఆవేదన బయటపెట్టుకున్నారు.

Also Read – అంబటి కి తత్త్వం బోధపడింది…అవంతి కి జ్ఞానోదయం..!


రఘురామ పదవీ అధికారం మీద వ్యామోహం లేదంటూనే ఎంపీ టికెట్‌ దొరకనందుకు బాధ పడుతున్నారు. ఇది వేరే విషయం. కానీ కొత్తగా వచ్చిన వారికి, ముఖ్యంగా వైసీపి నుంచి వచ్చిన వారికి, జగన్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ప్రశ్నించలేని వారికి మూడు పార్టీలు టికెట్స్ ఇచ్చినప్పుడు, వాటితో కలిసి సాగుతున్న తనకు టికెట్‌ ఎందుకు ఇవ్వలేదు? అనే రఘురామ ప్రశ్నకు టిడిపి, జనసేన, బీజేపీలే సమాధానం చెప్పాలి. ఆయన విషయంలో మూడు పార్టీకు కనీసం ఎందుకు స్పందించలేదో? చెప్పాలి.