మరో మూడు రోజులలలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతుంటే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలులోకి తెస్తూ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనిని 2019లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు, దీనిపై ఓటింగ్ జరిపి మూజువాణీ ఓట్లతో ఆమోదించినప్పుడే ప్రతిపక్షాలు అడుగడుగునా అభ్యంతరాలు చెప్పాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశాయి.
ఈ కారణంగా దీనికి పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానిని ఇంతకాలం అటక మీదే భద్రంగా దాచి ఉంచింది. కానీ ఇప్పుడు హటాత్తుగా ఎన్నికలకు ముందు దీని అమలుకి నోటిఫికేషన్ జారీ చేసి ప్రతిపక్షాలకు మోడీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
అసలు ఈ సీఏఏ-2019 చట్టం దేనికి?అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన ముస్లిమేతరులు అంటే హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టం రూపొందించబడింది. అంటే వారందరినీ భారతీయులుగా పరిగణింపబడతారన్న మాట!
దీనిపై ప్రతిపక్షాల అభ్యంతరాలు దేనికంటే, ఈ మూడు దేశాల నుంచి కనీసం కోటిమందికి పైగా శరణార్ధులు భారత్‌లో ఉంటున్నారు. వారిలో ముస్లింలు కూడా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది మహారాష్ట్ర, బిహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము కాశ్మీర్, హైదరాబాద్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారు.
అక్కడ అధికారంలో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలు వారందరికీ దొడ్డి దారిన ఆధార్, తెల్ల రేషన్ కార్డులు, ఓటు హక్కు కల్పించి తమ ఓటు బ్యాంకుని గణనీయంగా పెంచుకున్నాయి.
హైదరాబాద్‌లో వేలాదిమంది రోహ్యింగాలు ఉన్నారని, వారందరికీ కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ రక్షణ కల్పిస్తున్నారని, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వంటివారు బహిరంగంగానే ఆరోపణలు చేశారు.
దేశంలో అనేక కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పార్టీలు లౌకికవాదం అంటే ముస్లింలను అక్కున చేర్చుకోవడం మాత్రమే అనే గుడ్డి సిద్దాంతాన్ని త్రికరణశుద్ధిగా పాటిస్తున్నాయి. కనుక వాటన్నిటికీ ఈ సీఏఏ-2019 చట్టాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమే.
కానీ హిందుత్వ అజెండాతో పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం ముస్లింలకు ఈ చట్టాన్ని వర్తింపజేయకుండా, శరణార్ధులలో కొన్ని వర్గాల వారికి మాత్రమే భారతీయ పౌరసత్వం కల్పించి ఓటు హక్కు కూడా ఇస్తే, వారందరూ లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకే ఓట్లు వేస్తారు.
అందువల్లే కొన్ని రాష్ట్రాలలో మాత్రమే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మాత్రమే ఈ సీఏఏ-2019 చట్టంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని భావించవచ్చు. కనుక సీఏఏ-2019 చట్టం మానవతా దృక్పదంతో చేసినదే అయినా దీని వెనుక బలమైన ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా ఉన్నాయి.





