కృష్ణా జిల్లా గన్నవరంలో ఆదివారం నిర్వహించిన ‘కాంగ్రెస్ భరోసా సభ’లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీలా తాను అబద్ధాలు చెప్పబోనని.. చెప్పింది చేసి తీరుతానని అని ఆయన ప్రజలకు మాట ఇచ్చారు.
“ఆంధ్రులకు ఏం కావాలో ఆలోచించి ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధాని హోదాలో హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చి తీరుతాం. ఐదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు. హోదా విషయంలో ప్రాంతీయ పార్టీలు సరిగా పోరాడలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా హామీని పొందుపరిచాం. ఏపీని దేశంలో అగ్రగామిగా చేయడమే కాంగ్రెస్ లక్ష్యం,” అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. నెలకు రూ.12వేలు కంటే తక్కువ ఆదాయం కలిగిన 20 శాతం పేదలకు ఏటా రూ.72వేలు చొప్పున ఇస్తామన్నారు.
ఈ పథకం ద్వారా 5 కోట్ల కుటుంబాలు, 25 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఏ ప్రమాణాలు కూడా కాంగ్రెస్ ను ఆంధ్రప్రదేశ్ లో గట్టెక్కించే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ ఇటీవలే ప్రకటించిన అభ్యర్థులలో తెలిసిన మొహాలు కూడా లేకపోవడం ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితికి అడ్డం పడుతుంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని కూడా పోటీ చెయ్యమని ఒత్తిడి చేస్తే గానీ ఆయన పోటీకి ముందుకు రాకపోవడం గమనార్హం



