మన దేశంలో భావ ప్రకటన స్వేచ్చ ఉందా?అంటే ఉందని రాజ్యాంగం, చట్టం చెపుతున్నాయి. ‘చాలా ఉందని’ సోషల్ మీడియాలో వస్తున్న దారుణమైన పోస్టులు ద్రువీకరిస్తుంటాయి.
అలాగని స్వేచ్చ ఉందని కూడా గట్టిగా చెప్పలేము. మీడియా, సమాజం మీద ప్రభుత్వ కనిపించని నియంత్రణ ఉంటుంది. హీరోలు, వారి సినిమాలపై, రాజకీయ పార్టీలు, వాటి నాయకులు, తీరుతెన్నులపై ఎవరైనా విమర్శలు చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు.
ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ నిన్న సోషల్ మీడియాలో కొన్ని తన సొంత అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొన్ని గంటల తర్వాత తన ఖాతా డిలీట్ చేశారు.
“హైదరాబాద్ మళ్లీ మునిగింది.. హామీలన్నీ విఫలమయ్యాయి.. అన్నింటినీ గాడిన పెట్టడానికి కేసీఆర్ రావాలని జనం కోరుకుంటున్నారు,” అని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్‌లో ‘గాంధీ సాధువు కాదు.. అతను మహాత్ముడే కాదు,” అంటూ రాహుల్ రామకృష్ణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆయనకి ఎవరో గట్టిగా వార్నింగ్ ఇచ్చినందునే అకౌంట్ డిలీట్ చేసుకొని ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేడో రేపో ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకొని క్షమాపణ కూడా చెప్పుకోవలసి రావచ్చు. కనుక భావ ప్రకటన స్వేచ్చా ఉందా లేదా?అనే సందేహం కలుగుతుంది.
ఇటీవల కొన్ని వారాలుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరంలో రోడ్లు, కాలనీలు నీట మునిగాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలలో కాలనీలలోకి, ఇళ్ళలోకి నీళ్ళు చేరాయి. మూసీ నది ఉప్పొంగి ప్రవహించడంతో ఆ నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలను ప్రభుత్వమే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. వర్షాలు, వరదలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవేమీ రహస్యం కావు. అందరికీ కనిపిస్తున్నదే. రాహుల్ రామకృష్ణ ఇదే విషయం చెప్పారు.
కానీ ‘ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు,’ అని ముగించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగ్రహం, అసహనం కలిగించడం సహజం. ఎందుకంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ వరద కష్టాల నుంచి నగర ప్రజలకు ఉపశమనం కలిగించడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ పరిస్థితులలో కేసీఆర్ వచ్చినా ఆయన కూడా ఏమీ చేయలేరు కదా?





