అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల కన్నీటి గాధలను, అమరావతి నిర్మించకుండా తెర వెనుక జరిగిన కుట్రలను చూపిస్తూ ‘రాజధాని ఫైల్స్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సినిమాని విడుదల చేయకుండా స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణమ్ను రేపటికి వాయిదా వేస్తూ, ‘రాజధాని ఫైల్స్’ సినిమాని ప్రదర్శించరాదని ఆదేశించింది.
అయితే హైకోర్టు ఈ తీర్పు చెప్పేలోగానే గుంటూరు, విజయవాడతో సహ పలుచోట్ల ఉదయం షోలు పడ్డాయి. హైకోర్టు స్టే విధిస్తున్నట్లు ప్రకటించగానే, రెవెన్యూ అధికారులు హడావుడిగా థియేటర్లకు పరుగులు తీసి, సినిమాని మద్యలో నిలిపివేయించేసి, పోలీసుల సాయంతో ఫ్రేక్షకులను థియేటర్లలో నుంచి బయటకు పంపించేశారు.
దీంతో ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహంతో థియేటర్ల బయట కూర్చొని నిరసనలు తెలియజేశారు. కానీ హైకోర్టు స్టే విధించినందున సినిమాని ప్రదర్శించకూడదని వారికి నచ్చజెప్పి పంపించేశారు.
టిడిపి, జనసేన పార్టీల అధినేతలు కుట్రలు, కుతంత్రాలు చేసేవారిగా చూపించి ఎన్నికలలో ఆ రెండు పార్టీలను చావు దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతోనే వైసీపి ‘వ్యూహం’, ‘యాత్ర-2’, ‘శపధం’ మూడు సినిమాలు తీయించి ఎన్నికలకు ముందు విడుదల చేసుకుంటోంది.
వాటిలో ఇప్పటికే విడుదలైన ‘యాత్ర-2’ సినిమా చూసేందుకు ఉచితంగా టికెట్లు ఇస్తామన్నా వైసీపి శ్రేణులు కూడా వెళ్ళేందుకు ఇష్టపడటం లేదు. కానీ హైకోర్టు స్టే విధిస్తే సినిమా ప్రదర్శన మద్యలో నిలిచిపోతుందని తెలిసినా వేలాది మంది ‘రాజధాని ఫైల్స్’ సినిమా చూసేందుకు తరలివచ్చారు!
రెండూ ఓ రాజకీయ ఉద్దేశ్యంతో తీసిన సినిమాలే అయినప్పటికీ ‘యాత్ర’కు ఎవరూ ఎందుకు రావడంలేదు? ‘రాజధాని ఫైల్స్’ చూసేందుకు ఎందుకు క్యూకడుతున్నారు?అని ఆలోచిస్తే ప్రజాబిప్రాయం ఏమిటో అర్దమవుతుంది.
‘వ్యూహం’, ‘శపధం’ వంటి సినిమాలకు కూడా హైకోర్టులో బ్రేకులు పడి కాస్త ఆలస్యమైనా విడుదలవుతున్నట్లే, ‘రాజధాని ఫైల్స్’ కూడా నేడు కాకపోతే రేపైనా విడుదలకాక మానదని, అప్పుడు ప్రజలను ఎవరూ అడ్డుకోలేరని వైసీపి ప్రభుత్వం గ్రహించిన్నట్లు లేదు.




