టాలీవుడ్ ను బాలీవుడ్ వరకు విస్తరించిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పడంలో టాలీవుడ్ మొత్తం ఏకతాటి మీదకొస్తారు కానీ అదే జక్కన్న మీద ఈ స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నా, తన రాబోయే చిత్రం మీద రాజకీయంగా మతపరమైన ఆరోపణలు దూసుకొస్తున్నా టాలీవుడ్ మాత్రం మూగబోయింది.
నేను నాస్తికుడిని అంటూ జక్కన్న ‘వారణాసి’ మూవీ ఈవెంట్ లో చేసిన ఒకే ఒక్క ప్రకటన ఇన్నాళ్ళుగా ఎంతోమందిలో జక్కన్న పై అంతర్గతంగా దాగున్న అక్కసుని, ద్వేషాన్ని, అసూయను బయటకు తెచ్చింది. నాస్తికుడు అంటూ దేవుని పై సినిమాలు తీస్తావా.?
దేవుని పై సినిమాలు తీస్తూ వందల కోట్ల కలెక్షన్లు రాబట్టాలని ఆశ పడతావా.? దేవుని పై భక్తి లేని నువ్వు రాముడి పేరు మీద సినిమాలు తీస్తూ వ్యాపారం చేస్తావా.? ఆస్కార్ అవార్డు దక్కించుకున్న జక్కన్న ఈ స్థాయి మాటలు మాట్లాడతారా.?
రాజమౌళి ప్రకటనతో హిందూ సమాజం మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, ఇక పై రాజమౌళి తెరకెక్కించబోతున్న సినిమాలను హిందూ సమాజం బహిష్కరించాలి అంటూ ఇలా అనేకరకాల విమర్శలు, ఆరోపణలు, అలాగే కేసులు రాజమౌళిని చుట్టుముట్టాయి.
అయితే ఇందులో పనిలో పనిగా బీజేపీ కూడా తన గళాన్ని వినిపించేసింది. అయితే తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకు పట్టికెళ్ళిన రాజమౌళి పై ఈ స్థాయి విమర్శలతో దాడి జరుగుతున్నప్పటికీ జక్కన్నకు అండగా గొంతు వినిపించేందుకు కానీ ఆయనకు మద్దతు పలికేందుకు కానీ టాలీవుడ్ నుంచి ఏ ఒక్క ప్రముఖ సెలబ్రెటీ కూడా ముందుకు రాలేదు.
ఇలా టాలీవుడ్ మొత్తం మూగబోయినా ఒకే ఒక్క వ్యక్తి మాత్రం జక్కన వైపు నిలబడ్డారు, తన లాజికల్ ప్రశ్నలతో విమర్శకుల నోళ్లకు తాళం వేసేలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసారు. ” దేవుడిని నమ్మని వారు దేవుని పై మూవీ తీయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్న మీరు గ్యాంగ్ స్టార్ మూవీ తీయాలంటే ఆ దర్శకుడు గ్యాంగ్ స్టార్ అవ్వాలా”.? అనే ప్రశ్నతోనే జక్కన్న పై వస్తున్న విమర్శలకు బదులు చెప్పారు.
దేవుడ్ని నమ్మని వ్యక్తికీ వంద రేట్లు ఎక్కువ సక్సెస్ ఇచ్చాడు, దేవునికి దేవుడి భక్తుల కంటే కూడా నాస్తికుల మీదే ఎక్కువ ప్రేమ, అయినా ఈ విషయంలో దేవునికి లేని బాధ, ఇబ్బంది మీకెందుకు.? అంటూ మోస్ట్ కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన X వేదికగా ఈ పోస్ట్ చేసారు.
అయితే ఇక్కడ రాజమౌళి తానూ దేవుడ్ని నమ్మను అన్నారు, కానీ దేవుడిని కించపరుస్తూ కానీ, అలాగే దేవుడిని నమ్మేవారిని ఎగతాళి చేస్తూ కానీ ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. అలాగే తన కుటుంబంలోనే తన భార్య హనుమంతుడి భక్తురాలు అంటూ చెప్పుకొచ్చారు. తానూ నమ్మక పోయినప్పటికీ ఎక్కడ మరొకరి నమ్మకాన్ని హేళన చెయ్యలేదు, వారిని తన దారిలోకి రమ్మని బలవంతం చేయలేదు.
నమ్మడం, నమ్మకపోవడం అనేది వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు. వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఇతరుల మీద రుద్దకుండా, వారిని ప్రభావితం చేయకుండా తన పని తానూ చేసుకున్నంత వరకు సమాజానికి వచ్చే చేటేమి ఉండకపోవచ్చు.
అయినా ఒక సినీ ఇండస్ట్రీ వ్యక్తి మీద ఈ రకంగా విరుచుకుపడుతున్న వారంతా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య ఆయా పార్టీల నాయకుల మధ్య జరిగే మత రాజకీయాల పై స్పందించేందుకు సహసిస్తారా.? వారి పై కేసులు పెట్టేందుకు ముందుకొస్తారా.?
ఇటువంటి సమయంలో, సందర్భంలో మాత్రం రామ్ గోపాల్ వర్మ లాంటి డేరింగ్, కాంట్రవర్సీ దర్శకుడు తెలుగు సినీ పరిశ్రమకు అవసరమేమో…అనిపించకమానదు. మరి ఇప్పటికైనా జక్కన్నకు మద్దతు పలికేందుకు టాలీవుడ్ నుంచి ఎవరైనా ముందుకొస్తారో లేదో చూడాలి.





