వారణాశి టైటిల్ ఈవెంట్‌లో రాజమౌళి హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అప్పుడే ఆయనపై హైదరాబాద్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదైంది.
మొన్న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన వారణాశి టైటిల్ రిలీజ్ ఈవెంట్‌లో “నాకు దేవుడిపై నమ్మకం లేదు కానీ నా భార్య హనుమంతుడిని స్నేహితుడుగా భావిస్తుంటుంది. ఆయన ఎల్లప్పుడూ మా వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటాడని నమ్ముతుంది.
కానీ ఈ ఈవెంట్‌లో ఇలా చిన్న అవరోధం ఏర్పడింది. అప్పుడు మా నాన్నగారు వచ్చి హనుమంతుడే వెనుక ఉండి అన్నీ నడిపిస్తాడని చెప్పినప్పుడు, నాకు అయన మీద, నా భార్య మీద చాలా కోపం వచ్చింది,” అని అన్నారు.
ఆ క్షణం నుంచే ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.
శ్రీరాముడు, హనుమంతుడిపై మీకు భక్తి, నమ్మకం లేనప్పుడు వారి పాత్రలతో సినిమా తీయడం దేనికి?వారినీ, వారి గొప్పదనాన్ని సినిమాలో చూపుతూ ఉపయోగించుకుంటునప్పుడు ఇలా చులకనగా మాట్లాడటం దేనికి?అని కొందరు విమర్శిస్తున్నారు.
ఇటువంటి మాటలతో హిందువుల మనోభావాలు ఎలాగో దెబ్బ తింటాయి. మీ సొంత కుటుంబంలో శ్రీరాముడిని, హనుమంతుడిని పూజిస్తున్నప్పుడు వారి మనోభావాలు దెబ్బ తినవా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
రాజమౌళి బహిరంగంగా, బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయనపై పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసిన హిందూ సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మీడియా సమావేశాలలో, ఈవెంట్‌లలో చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడే రాజమౌళి ఈవిదంగా నోరు జారడం ఆశ్చర్యకరమే!
అయితే ఇది రాజమౌళి ఒక్కరికే సంబంధించిన సమస్య కానేకాదు. చాలా మంది సెలబ్రెటీలు, ముఖ్యంగా హిందూ సెలబ్రెటీలు తమకి హిందూమతంపై నమ్మకం లేదని చెప్పడం, హిందూ మతాన్ని, దేవుళ్ళని చులకన చేసే విధంగా మాట్లాడుతుండటం పరిపాటిగా మారిపోయింది.
మహాభారత, భాగవత, రామాయాణాల ఔచిత్యం పెంచేవిధంగా తీసిన సినిమాలున్నాయి. వాటిని వక్రీకరించి, అపహాస్యం చేసే సినిమాలు కూడా ఉన్నాయి.
ఇలా అందరికీ ‘హిందూమతంపై ఫ్రీ-హ్యాండ్’ ఎందుకు లభించిందంటే, హిందువులు వారి గొప్పదనం చూసి గౌరవిస్తున్నారు కనుకనే! వారి సినిమాలపై ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా చూసి ఆనందిస్తున్నారు కనుకనే! ఇందుకు తాజా ఉదాహరణగా ‘వారణాశి టైటిల్ పోస్టర్’ మన కళ్ళెదుటే ఉంది.
నందీశ్వరుడు శివుడి వాహనం… అలాంటి నందీశ్వరుడిపై మహేష్ బాబు త్రిశూలం పట్టుకొని ‘రైడ్’ చేస్తున్నట్లు పోస్టర్ వేస్తే అందరూ అది చూసి ‘ఆహా ఓహో’ అన్నారు తప్ప తప్పని ఎవరూ అనలేదు. భావించలేదు.
కనుక ఒక తప్పుకి చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేస్తూ, మరో తప్పుకి బాధపడి ఏం ప్రయోజనం? మార్పు సినిమా వాళ్ళలో కాదు మనలోనే రావాలి!






