వారణాశి హైప్ మంచిదే… వివాదం కాదు!

Rajamouli faces controversy over Varanasi movie title dispute

ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు సాధారణ పౌరులు నోరు జారితే చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అదే సినీ రాజకీయ ప్రముఖులు నోరుజారితే వంద కోట్ల పరువు నష్టం దావాలు ఎదుర్కోవలసి రావచ్చు లేదా కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి రావచ్చు. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి పరిస్థితి ఇదే.

వారణాశి టైటిల్‌ విషయంలో ఓ కేసు… ఆ ఈవెంట్‌లో హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలతో మరో కేసు ఎదుర్కోవలసివస్తోంది. ఆ టైటిల్‌ని తాము ఇదివరకే రిజిస్టర్ చేసుకున్నామని రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ ఫిలిమ్‌ ఛాంబర్‌కి పిర్యాదు చేసింది.

ADVERTISEMENT

సిహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో వారణాశి పేరుతో సనాతన ధర్మ పరిరక్షణ అంశం ఆధారంగా ఈ సినిమా తీయబోతున్నట్లు నిర్మాత విజయ్ చెప్పారు. వారణాశి టైటిల్‌ తమ సంస్థ పేర రిజిస్టర్ అయినట్లు ఫిలిం ఛాంబర్ తమ లేఖ కూడా ఇచ్చిందని చెప్పారు. కానీ రాజమౌళి-మహేష్ బాబు సినిమాకి వారణాశి టైటిల్‌ పెట్టుకోవడం సరికాదన్నారు.

ఇక్కడ ఫిలిం ఛాంబర్‌ని కూడా తప్పు పట్టాల్సి ఉంటుంది. ఓ నిర్మాత లేదా దర్శకుడు తమపై నమ్మకంతో సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకుంటున్నప్పుడు, అదే టైటిల్‌తో మరొకరు ఉపయోగించుకోవడానికి అనుమతించడం తప్పు. ఒకవేళ రాజమౌళి ఇంకా ఫిలిం ఛాంబర్ వద్ద టైటిల్‌ రిజిస్టర్ చేసుకోకుండా ఈవెంట్‌లో ప్రకటించారనుకున్నా, అలా ప్రకటించేముందు ఫిలిం ఛాంబర్‌లో కనుక్కొని ఎవరూ ఆ టైటిల్‌ రిజిస్టర్ చేసుకోలేదని ధ్రువీకరించుకోవడం పద్దతి.

మాది వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌ సినిమా… పెద్ద దర్శకుడి సినిమా… మా సినిమాలో ఫలానా పెద్ద హీరో ఉన్నాడు… కనుక ‘టేకన్ ఫర్ గ్రాంటడ్‌’ అనుకున్నా, చిన్న సినిమా దర్శక, నిర్మాతలే కదా నచ్చజెప్పి ఒప్పించేయవచ్చు అనుకున్నా తప్పే.

ఒకవేళ తప్పు కాదనుకుంటే, రేపు మరో దర్శకనిర్మాతలు ‘వారణాశి’ టైటిల్‌తో సినిమా ప్రకటిస్తే రాజమౌళి కూడా అభ్యంతరం చెప్పకూడదు!

సినిమా టైటిల్స్ విషయంలో తరచూ ఇటువంటి వివాదాలు ఎవరికీ మంచిది కాదు. కనుక ఫిలిం ఛాంబర్‌లో ఇప్పటికే దీనికో విధానం ఉండే ఉంటుంది. అయినా ఈవిదంగా సమస్యలు ఎందుకు వస్తున్నాయో గమనించి అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories