పెద్ద హీరోలకు జ్ఞానోదయం అయ్యిందా? ఒకరి తర్వాత ఒకరు వినూత్నమైన పాత్రల వైపుకు మొగ్గుచూపుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. జూనియర్ ఎన్టీఆర్ కు జ్ఞానోదయం అయ్యి ‘టెంపర్, నాన్నకు ప్రేమతో’ వంటి వినూత్నమైన సినిమాలను ఎంపిక చేసుకోగా, అదే బాటలో ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ కూడా నడుస్తున్నట్లు కనపడుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
‘ధృవ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రామ్ చరణ్, తన తదుపరి సినిమాతో ఓ ప్రయోగమే చేయబోతున్నట్లుగా సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ‘ప్రయోగం’ అంటే ఆమడ దూరంలో నిలిచే మెగా ఫ్యామిలీ హీరోలలో వచ్చిన మార్పుకు నిదర్శనమని చెప్పే విధంగా, సుకుమార్ దర్శకత్వం వహించే తన తదుపరి సినిమాలో రామ్ చరణ్, ఓ చెవిటివాడి గెటప్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
‘చెవిటివాడు’ అంటే పూర్తిగా వినపడకుండా ఉండే వ్యక్తి కాకుండా, హాస్యరసం పండే విధంగా రామ్ చరణ్ కు ఈ చెవిటి రోల్ ను సుకుమార్ డిజైన్ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. వైవిధ్యానికి ‘బ్రాండ్ అంబాసిడర్’ లాంటి సుకుమార్ సినిమాను ‘ఓకే’ చేసినపుడే చెర్రీలో మార్పు వచ్చిందన్న సంకేతాలు కనపడ్డాయి. తాజాగా హల్చల్ చేస్తున్న ఈ సమాచారంతో అది కాస్త ధృవీకరణ అవుతోంది. అయితే అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలిఉంది.



