వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్నికలకు ముందు లక్ష్మిస్ ఎన్టీఆర్ తో వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ సినిమాను ఎన్నికల ముందు విడుదల కానివ్వలేదని, తన ప్రెస్ మీట్ ను కూడా అడ్డుకున్నారని అక్కసుతో రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు పై ప్రతీకారంతో రగిలిపోతున్నారు. అందులో భాగంగానే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా అప్పట్లోనే ప్రకటించాడు.
ఎప్పుడు మొదలైందో.. ఎక్కడి వరకూ వచ్చిందో చెప్పకపోయినా, రేపు ఉదయం 9 గంటలకు ఈ సినిమా తొలి పాట ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఇదే సమయంలో ఈ సినిమా ఎలాంటి వివాదాలకు తావివ్వని సినిమా అని తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అయితే కులాల కుంపట్లు నిత్యం రగిలే ఆంధ్రప్రదేశ్ ఇటువంటి సినిమా తీయ్యడం ప్రమాదమే. పైగా ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ – టీడీపీల మధ్య దాడులు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సునామీ సృష్టించింది. టీడీపీ కంచుకోటలను కూడా బద్దలు కొట్టింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీడీపీ ఓటమిపాలైంది. కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉండే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వైసీపీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. ఇదే ఇతివృత్తంగా వర్మ సినిమా తీస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనేది ఇంతవరకూ బయటపెట్టలేదు. ఆ వివరాలు రేపు తెలిసే అవకాశం ఉంది.



