సంక్రాంతికి విడుదలై, సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుని వసూళ్ల పరంగా దూసుకెళుతున్న చారిత్రక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని మరింతగా ప్రమోట్ చేసేందుకు జక్కన్న రాజమౌళి, భళ్ళాలదేవ రానాలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు టీవీ చానళ్లలో బాలకృష్ణ, క్రిష్ తదితరుల ఇంటర్వ్యూలు నిత్యమూ ప్రసారం అవుతుండగా, ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఓ వినూత్న కార్యక్రమాన్ని రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది.
ఇందులో బాలకృష్ణను రానా, క్రిష్ ను రాజమౌళి ఇంటర్వ్యూ చేసినట్టు సమాచారం. చిత్రంపై సరికొత్త విశేషాలతో కూడిన ఈ స్పెషల్ ఇంటర్వ్యూలు ఈ వీకెండ్ లో ప్రసారం కానున్నాయని తెలుస్తోంది. ఇంకా చిత్రం చూడని వారిని ఈ కార్యక్రమాలు థియేటరుకు తీసుకెళ్ళే విధంగా ఉంటాయని టాక్. అయితే, ఈ సినిమాలో గొప్ప కథ లేదన్న విషయం నిజమేనని, అది లోపమే అయినప్పటికీ, ఉన్నంతలో శాతకర్ణి గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేసి విజయవంతమయ్యామని బాలకృష్ణ అన్నారు.
ఇదిలా ఉంటే, ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడం వృధా అని కరీంనగర్ మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు అంటున్నారు. పన్ను మినహాయింపు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని కౌన్సిల్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ… ఒక సినిమాను చూడాలంటూ ప్రజలను ప్రోత్సహించడానికే పన్ను మినహాయింపులను ప్రభుత్వం ఇస్తుందని… అయితే, ఆ మేరకు థియేటర్ యాజమాన్యాలు టికెట్ ధరలను తగ్గించి అమ్మాలని… కానీ, టికెట్ ధరలను ఏమాత్రం తగ్గించకుండానే థియేటర్ యాజమాన్యాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సభ్యులు మండిపడుతున్నారు.



