‘లీడర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దగ్గుపాటి రానా, ప్రస్తుతం ఉన్న స్థాయికి ఎదుగుతాడని బహుశా తండ్రి సురేష్ బాబు కూడా ఊహించారో లేదో సందేహమే. తెరవెనుక గ్రాఫిక్స్ వర్క్ చేసుకుంటూ కాలం వెలిబుచ్చుతున్న రానాను శేఖర్ కమ్ముల ‘లీడర్’ ద్వారా హీరోగా నిలబెడితే, రాజమౌళి ‘బాహుబలి’ ద్వారా స్టార్ డంను తెచ్చిపెట్టారు. నేషనల్ వైడ్ గా పాపులారిటీ ఉన్న అతికొద్ది మంది తెలుగు హీరోలలో రానా ఒకరు.
ముఖ్యంగా ‘బాహుబలి’ విడుదలైన తర్వాత రానాకు ప్రేక్షకుల ఆదరణ అంతకంతకూ పెరుగుతూ పోతోందన్న విషయం ట్విట్టర్ లోని ఫాలోయర్స్ సంఖ్య చెప్పకనే చెప్తోంది. తాజాగా ఈ సంఖ్య 3 మిలియన్స్ (30 లక్షలకు) చేరుకుంది. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ అశేష ప్రేక్షకుల నీరాజనం అందుకుంటున్న రానాకు ట్విట్టర్ లో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల కంటే ఎక్కువ ఫాలోయింగే ఉంది.
భళ్ళాలదేవుడు కంటే ముందు స్థానంలో ఒక్క ప్రిన్స్ మహేష్ బాబు (3.3 మిలియన్స్) ఫాలోయర్స్ తో ఉండగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1.92 మిలియన్స్ తో త్వరలోనే 2 మిలియన్స్ కు చేరుకోబోతున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే 1 మిలియన్ సంఖ్యకు చేరుకోగా, అల్లు అర్జున్ 1.48 మిలియన్స్ తో తారక్ కంటే ముందే ఉన్నాడు. అయితే ఈ టాప్ హీరోలందరిలోకల్లా సోషల్ మీడియాలో రానానే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు.



