చాలా రోజుల తర్వాత చీర కట్టుతో సంప్రదాయబద్ధమైన పాత్రలో “నెక్స్ట్ నువ్వే” చిత్రంలో నటించానని ‘జబర్దస్త్’ బ్యూటీ రష్మీ గౌతమ్ స్పష్టం చేసింది. ఆది హీరోగా రష్మీ కీలకపాత్రలో నటించిన ‘నెక్ట్స్ నువ్వే’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన రష్మి, ట్రైలర్ చూసి అంతా తన పాత్ర గ్లామరస్ గా ఉంటుందని అనుకుంటున్నారని తెలిపింది.
కానీ, తన పాత్ర ఆ టైప్ కాదని, ఏ మాత్రం రెచ్చగొట్టేలా ఉండదని, చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. ‘సినిమాల్లో అసభ్యకర దుస్తులు వేస్తున్నారేంటి?’ అని చాలా మంది అడుగుతున్నారని, అయితే, తాను ఎక్స్ పోజింగ్ చేయడం లేదని, సినిమాలో కథ, సందర్భాన్ని బట్టి దుస్తుల ఎంపిక ఉంటుందని చెప్పింది.
ఇతర హీరోయిన్లతో పోలిస్తే తాను వారిలో కనీసం 30 శాతం కూడా ఎక్స్ పోజ్ చేయడం లేదని, సినిమాకు సంతకం చేసే ముందే సౌకర్యంగా ఉండే దుస్తులే ధరిస్తానని దర్శకనిర్మాతలకు చెప్పేస్తానని తెలిపింది. పాత్ర పరిధి మేరకు అవసరమైన మేర నటిస్తానని, తనపై వచ్చే కామెంట్ల గురించి పట్టించుకోనని, సినీ రంగంలో ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నానని చెప్పింది.
‘గుంటూర్ టాకీస్’తో మంచి గుర్తింపు వచ్చిందని తెలిపిన రష్మీ, ‘నాకు సింగిల్ హీరోయిన్ సినిమాల్లోనే అవకాశం ఇవ్వండి’ అని అడగడం లేదని చెప్పింది. ఇద్దరు, ముగ్గురు కథానాయికలు ఉన్న సినిమాల్లో కూడా నటించేందుకు సిద్ధమని, బికినీలు ధరించడానికి అనువైన శరీరం తనదని, చాలా మందికి అలాంటి శరీరం ఉండదని బాలీవుడ్ బ్యూటీ డైలాగ్ లను కూడా పలికింది.


