తన తమ్ముడు భరత్ కారు ప్రమాదంలో మరణించిన వేళ, కనీసం అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదన్న నిందను మోయాల్సి రావడం తనకెంతో బాధను కలిగించిన విషయమని మాస్ మహారాజా రవితేజ ఆవేదన వ్యక్తం చేసారు. తాజాగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… “తనకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని, ఇప్పుడు చెప్పేందుకు ఏమీ లేదని, తాము ఏ పరిస్థితిలో ఉన్నామో కూడా చూడకుండా, సామాజిక మాధ్యమాల్లో హిట్స్ కోసం రాద్ధాంతం చేశారని, ఎంతమాత్రమూ ఆలోచించకుండా నిందలు వేశారని” తన మనోవేదనను వెలిబుచ్చారు.
ఆ రోజు తన తండ్రి, తల్లి కుప్పకూలిపోయారని, వారు ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేదని, వారెక్కడ తమకు దూరమవుతారోనన్న ఆలోచన, ఛిద్రమైన భరత్ ముఖం చూడలేకే తాము వెళ్లలేదని మరోసారి స్పష్టం చేశాడు. తమ్ముడి కర్మకాండలు అపరిచితులతో చేయించలేదని, తన తల్లి సోదరి భర్తతోనే చేయించామని, ఆయన ఎవరో తెలుసుకోకుండానే, భరత్ ను అనాధను చేశామని చెబుతూ తన కుటుంబాన్ని అవమానించారని, తెలిసి తెలియని రాతలు ఎంతగా కృంగదీస్తాయో అన్న ఆలోచించుకోవాలని సూచనలు చేసారు.
ఇక భరత్ మరణించిన రోజు షూటింగ్ లో ఎంతో మంది డేట్స్ ఉన్నాయని, ఇది కోట్ల వ్యాపారమని, ఒక్క రోజు తేడా జరిగినా నిర్మాత నష్టపోతాడన్న ఆలోచనతో, తన మనసులోని బాధను దిగమింగుకుని సైతం షూటింగ్ కు వెళ్లానని, దాని పైన కూడా తనను ఎంతో మంది విమర్శించారని అన్నాడు. భరత్ పుట్టిన రోజున కలిశామని, ఆ రోజు మాట్లాడిన మాటలే ఆఖరు అయ్యాయని, ఔటర్ పై తన తమ్ముడి ప్రాణాల కోసమే లారీ బ్రేక్ డౌన్ అయినట్టు ఉందని తన మనసులోని బాధను వ్యక్తం చేశాడు.



