ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు నిద్రను దూరం చేసిన రిలయన్స్ జియోపై భారతీ ఎయిర్ టెల్ యుద్ధానికి సిద్ధమైంది. జియో ఆఫర్లపై ఇప్పటికే ‘ట్రాయ్’కు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎయిర్ టెల్, తాజాగా కాంపిటిషన్ కమిషన్ ఇండియా (సీసీఐ)కి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. ఉచిత ఆఫర్ల పేరుతో జియో దోపిడీకి పాల్పడుతోందని, ఉచిత ఆఫర్ల పేరుతో పోటీదారులను మార్కెట్ నుంచి తప్పించాలని, తద్వారా ఏకఛత్రాధిపత్యం సాగించాలని జియో చూస్తోందని సదరు లేఖలో ఆరోపించింది.
జియో ఆఫర్లతో చిన్న సంస్థలు మార్కెట్ నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, మార్కెట్ లో ఓ సారి పాతుకుపోయిన తర్వాత చార్జీల మోతతో వినియోగారులకు చుక్కలు చూపిస్తుందని ఆరోపించింది. అయితే ఎయిర్ టెల్ చేసిన ఆరోపణలను జియో ఖండించింది. తమకు వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలో భాగంగానే ఎయిర్‌టెల్ ఈ ఆరోపణలు చేస్తున్నట్టు జియో అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగానే జియో ఆఫర్లు ఉన్నట్టు ఇదివరకే ట్రాయ్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.



