రంగుల ప్రపంచంలో వెలిగిపోదామని వస్తున్న తారమణులు మధ్యలో రాలిపోతున్న వైనం ఆందోళనను కలిగించే అంశం. మూడు రోజుల ముందు జరిగిన నటి సపర్ణ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడక ముందే మరో హీరోయిన్ తన ఫ్లాట్ లో విగతజీవిగా కనిపించడం ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. అయితే ఈ సారి రాలింది… తమిళ పరిశ్రమ నుండి కాదు, మలయాళ చిత్ర సీమ నుండి!
మలయాళ టీవీ, సినిమా రంగంలో రాణిస్తున్న నటి రేఖా మోహన్ త్రిసూర్ లోని తన ఫ్లాట్ లో ఆత్యహత్య చేసుకుందని భావిస్తున్నారు. గత రెండు రోజులుగా ఫోన్ లో మాట్లాడాలని ప్రయత్నించిన తన భర్తకు అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన మీదట ఫ్లాట్ కు వెళ్ళగా, లోన గడియ వేసుకుని ఉండడంతో, దానిని బద్దలు కొట్టి లోపలకు వెళ్ళడంతో, రేఖా మోహన్ మృతదేహం దర్శనమిచ్చింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, దానికి గల కారణాలు వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం త్రిసూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. సినీ పరిశ్రమలలో వరుసగా నమోదవుతున్న ఈ ఉదంతాలు, ట్రేడ్ వర్గాలను కంగారు పెడుతున్నాయి.



