‘ఆల్ ఫ్రీ’ ఆఫర్ మంత్రంతో టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అతి తక్కువ సమయంలోనే (83 రోజుల్లోనే) 50 మిలియన్ వినియోగదారులను తన సొంతం చేసుకుని రికార్డుల పరంపర మొదలుపెట్టిన జియో, తాజాగా ఎవరూ ఊహించని విధంగా 100 మిలియన్ కస్టమర్లను అందుకుని, తనకు తిరుగులేదని నిరూపించుకుంది.
10 కోట్ల మంది వినియోగదారులను టార్గెట్ పెట్టుకున్న జియో, ఆ లక్ష్యాన్ని దాటేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా తెలిపారు. ఏకంగా 100 మిలియన్ కస్టమర్లను జియో సొంతం చేసుకోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన అంబానీ, ఈ టార్గెట్‌ను తాము నెలల వ్యవధిలోనే చేరుకుంటామని అంచనా వేయలేదని అన్నారు. అయితే ఆధార్ ఆధారిత సిమ్ కార్డులను అందించడం తమకు ప్లస్ పాయింట్ అయిందని తెలిపారు.
జియో సిమ్ కస్టమర్లందరికీ 2016 సెప్టెంబర్ 5 నుంచి ఉచిత సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఉచిత కాల్స్, డేటా సేవలను అందిస్తోన్న జియోకు 4జీ వినియోగదారులందరూ జై కొడుతున్నారు. రోజు రోజుకీ జియో కస్టమర్ల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. తాజాగా వదిలిన హ్యాపీ న్యూ ఆఫర్ తో మరింత మంది జియో బాట పట్టడం వలనే ఈ ‘ఆల్ టైం రికార్డు’ జియో వశమైందని టెలికాం రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.



