టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో తాజాగా మరో సంచలనంతో ముందుకొచ్చింది. ‘వెల్‌కమ్ ఆఫర్’తో ప్రత్యర్థి టెలికం కంపెనీలకు వణుకు పుట్టించిన జియో ‘న్యూ ఇయర్ ఆఫర్’తో దానిని మరో మూడు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో సంచలనం సృష్టించేందుకు జియో సిద్ధమైంది.
‘4జీ వీవోఎల్టీఈ’ సాంకేతికత కలిగిన ల్యాండ్ ఫోన్లను కొత్తగా విడుదల చేసి, ఇప్పటికే వాటిని తమ ఖాతాదారులకు పంపిణీ చేయడం ప్రారంభించింది. జియో సిమ్ తో కాల్స్ నుంచి డేటా వరకు అన్నీ ఫ్రీ అన్న విషయం తెలిసిందే. కానీ ల్యాండ్ ఫోన్లలో ఎలా? అంటే… ఈ ల్యాండ్ ఫోన్‌లో ఉండే వైర్ లెస్ విధానంతో ఈ మొత్తం ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.
హైదరాబాద్ లోని అంకుర సంస్థ వైబ్రిడ్జ్ నెట్‌వర్క్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసిన ఇందులో ఉండే హాట్ స్పాట్ సాయంతో 8 పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. కొత్త ల్యాండ్ లైన్ ఫోన్ కు ఉండే యాంటెన్నా 4జీ సిగ్నళ్లను అందుకోవడమే కాకుండా వైఫై రోటర్ గానూ పనిచేయడం విశేషం. స్మార్ట్ ఫోన్ లానే ఈ ఫోన్లోనూ సినిమాలు చూసుకోవచ్చు. ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్ చేసుకోవచ్చు.
ఒక్కమాటలో చెప్పాలంటే పేరుకే ల్యాండ్ లైన్. మిగతావన్నీ సేమ్ టు సేమ్. మరో విశేషం ఏంటంటే, ఈ ఫోన్ ను ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. జియో కనెక్షన్ ఉంటే నాలుగు నెలల పాటు ఉచిత సేవలు పొందవచ్చు. ఆన్ లైన్ లోనూ ఈ ఫోన్లు లభ్యమవుతుండడంతో జియో కస్టమర్ల సంఖ్య మరింతకు పెరుగుతుందని సంస్థ యాజమాన్యం అంచనా వేస్తోంది.


