రిజర్వేషన్స్ ఉద్యమాలే జెన్-జీని చీల్చేస్తాయి.. జాగ్రత్త!

Reservation Hatavo Movement Raises Debate Among Gen-Z Youth

ఢిల్లీలో కాక్రోచ్ జనతాపార్టీ అధ్వర్యంలో జరిగిన ఆందోళనలు విజయవంతం అవడంతో, ఆ స్పూర్తితో రకరకాల సమస్యలతో ఉద్యమాలు మొదలవుతున్నాయి. వాటిలో ‘రిజర్వేషన్ హఠావో’ ఆందోళన కూడా ఒకటి.

కుల ఆధారిత రిజర్వేషన్లకు స్వస్తి చెప్పి, విద్య, ఉద్యోగాల్లో అవకాశాలను ఆర్థిక పరిస్థితి ఆధారంగా కల్పించాలని, క్రిమీలేయర్‌ను పటిష్టంగా అమలు చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.

ADVERTISEMENT

అయితే రిజర్వేషన్ హఠావో ఉద్యమానికి మద్దతుగా యువత ఎంత పెద్ద సంఖ్యలో నిలబడగలదో, రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్న యువత కూడా దేశంలో అంతే పెద్ద సంఖ్యలో ఉంది. కనుక వారు ఈ ఉద్యమాన్ని తమ హక్కులపై దాడిగా భావిస్తే వారు కూడా ఉద్యమించవచ్చు.

కొన్ని దశాబ్దాల క్రితం ఇదేవిధంగా దేశంలో రిజర్వేషన్లకు అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు సమాజంలో తీవ్ర విభజనకు దారి తీశాయి. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో జెన్-జీ కూడా చీలితే, ఇకపై ఏ సమస్యపై కలిసికట్టుగా పోరాడలేని పరిస్థితి ఏర్పడుతుంది.

నేటికీ రాజకీయాలలో కుల సమీకరణాల ఆధారంగా టికెట్లు, మంత్రి పదవులు పంపిణీ చేస్తూ, అదే.. సామాజిక న్యాయం అని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు, ప్రజలు కూడా వాటిని అంగీకరిస్తున్నప్పుడు, విద్య, ఉద్యోగాల విషయంలో కోట్లాది మంది యువత భవిష్యత్తో ముడిపడున్న రిజర్వేషన్లు వద్దంటే ఎలా?అనే ప్రశ్నకు ముందుగా సమాధానం వెతకాల్సి ఉంటుంది.

కానీ క్రిమీలేయర్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేచేయడం, ఆర్థికంగా బలహీన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్స్ పరిమితం చేయాలనే వాదన, డిమాండ్ రెండూ చాలా సహేతుకంగానే ఉన్నాయి.

‘రిజర్వేషన్స్ హటావో’ అంటే రాజకీయ పార్టీలకు సమస్య మొదలవుతుంది. వాటితోనే రాజకీయాలు చేస్తున్నప్పుడు అవి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపలేవు. కనుక వీటిని పరోక్షంగా నీరుగార్చేందుకు అన్ని పార్టీలు తలోచేయి వేసినా ఆశ్చర్యం లేదు.

మా సమస్యలు, మా ఆలోచనలు, వాటిని మేము పరిష్కరించే విధానాలు వేరని జెన్-జీ చెప్పుకుంటోంది కనుక రాజకీయాలకు అతీతంగా, సమాజంలో చీలిక ఏర్పడకుండా ఈ సమస్యకు కూడా వారే తగిన పరిష్కారంతో ముందుకు వస్తే యావత్ దేశం స్వాగతిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories