కల్వకుంట్ల కవిత ప్రెస్‌మీట్‌లో హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరూ సిఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీని అధోగతి పాలు చేశారని ఆరోపించారు. ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది.
ఈ ఆరోపణలపై సిఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందిస్తూ, “మీరు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి లక్షల కోట్లు సంపాదించారు. ఆ అవినీతి సొమ్ము పంపకాల కోసమే ఈ గొడవ అంతా! ఆ పంపకాలలో తేడా వచ్చి మీరు మీరూ కొట్టుకొని రోడ్డున పడితే మద్యలో నన్నెందుకు అంటారు?
కవిత వెనుక నేనున్నానని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. హరీష్ రావు వెనుక నేనున్నాని కవిత అంటుంది. ఇలాంటి దిక్కుమాలిన పార్టీలో, ఇలా కుట్రలు చేసుకుంటున్నవారితో బుద్దున్నవాడు ఎవడైనా చేతులు కలుపుతాడా?
మీ ఇంట్లో, మీ పార్టీలో పంచాయితీలు ఉంటే మీరు మీరు కొట్టుకోండి. కానీ నన్ను, నా పార్టీని మద్యలోకి లాగొద్దు. మీలా కడుపులో కత్తులు పెట్టుకొని ప్రేమలు నటించడం నాకు చాతకాదు. నాకు నా పార్టీ, నా రాష్ట్రం, నా ప్రజలే ముఖ్యం తప్ప మరేదీ కాదు.
మీలో మీరు కుమ్ములాడుకుంటూ ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకుంటూ మళ్ళీ ఇతరులని ఎందుకు నిందిస్తారు?మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. మీ పార్టీ చెల్లని వెయ్యి రూపాయల నోటు వంటిది.
అయినా చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా… అని ఊరికే అనలేదు పెద్దలు. నాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మరే పార్టీని బ్రతకనీయకూడదని, మరెవరూ రాజకీయాలలో ఉండకూడదని మీరు ఎన్నో కుట్రలు చేశారు. కేసులు పెట్టించి వేధించారు.
టీడీపి ఎంతో మందికి రాజకీయ జీవితం ఇచ్చిన ఓ అద్భుతమైన రాజకీయ పార్టీ. మీ కుట్రలు, వేధింపుల కారణంగా అది కూడా రాష్ట్రంలో కనుమరుగయ్యి పోయే పరిస్థితి ఏర్పడింది.
నాడు అధికారంలో ఉండగా మీరు చేసిన ఆ పాపాలు, ఆ అన్యాయాలకే ఇప్పుడు ఈవిదంగా శిక్ష అనుభవిస్తున్నారు. ప్రకృతి ఎవరినీ విడిచిపెట్టదని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంది? మీ కర్మ ఫలమే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు.
ఇంత జరిగినా ఇంకా ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉన్నారు. నా ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకున్నారు. కానీ మీకు మీరే మీ పార్టీని కూల్చేసుకున్తున్నారు. కూలిపోయి శిధిలమవుతున్న మీ పార్టీతో పంచాయితీలు మాకెందుకు?” అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.





