బీఆర్ఎస్‌ పార్టీతో రేవంత్ రెడ్డి మైండ్ గేమ్స్… ఫలిస్తాయా?

Revanth Reddy and BRS political debate

తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ ముఖ్య నేతల భూములు, ఫామ్‌హౌసులు పరిశీలనకంటూ కాంగ్రెస్‌ నాయకులు బస్సులు వేసుకొని పర్యటనలు చేస్తుండటం కాస్త ఆశ్చర్యంగా, ఎబ్బెట్టుగా అనిపిస్తోంది.

కాంగ్రెస్‌ చేతిలోనే అధికార యంత్రాంగం ఉన్నప్పుడు కాంగ్రెస్‌ నేతలు బీఆర్ఎస్‌ నేతల ఇళ్ళపైకి దండయాత్రలు చేయాల్సిన అవసరం ఏమిటి?

ADVERTISEMENT

సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశిస్తే రెవెన్యూ అధికారులు, సిబ్బంది కేసీఆర్‌ ఫామ్‌హౌసు నిర్మించుకున్న ఎర్రవల్లి గ్రామంలో సర్వేలు చేస్తున్నారు కదా? అలాగే బీఆర్ఎస్‌ నేతల అందరి ఇళ్ళు, స్థలాలని సర్వే చేసి నివేదికలు ఇస్తారు కదా? మరి కాంగ్రెస్‌ నేతలకు ఎందుకీ శ్రమ?

అయినా అక్కడకు వెళ్ళి వారు ఫోటోలు దిగి, మీడియాతో నాలుగు మాటలు మాట్లాడి తిరిగి రావడం తప్ప ఏం చేయగలరు? దాని వలన సిఎం రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్‌ పార్టీ నవ్వుల పాలవడం తప్ప ఒరిగేదేముంది?

బీఆర్ఎస్‌ పార్టీ నేతల స్థలాలు, ఫామ్‌హౌసుల వద్దకు కాంగ్రెస్‌ నేతలను పంపించి సిఎం రేవంత్‌ రెడ్డి తప్పటడుగు వేశారా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్‌ నేతల పర్యటనలు పైకి నవ్వులాటగా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక చాలా బలమైన వ్యూహమే ఉందనిపిస్తోంది.

కాంగ్రెస్‌ మంత్రులు 22ఏ చట్టాన్ని అడ్డుపెట్టుకొని ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల భూములును కబ్జా చేస్తున్నారని, సెటిల్‌మెంట్స్ చేస్తున్నారంటూ కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. కానీ అదే 22ఏ కింద ఉన్ననిషేదిత భూములలో అధిక భాగం కేసీఆర్‌ అండ్ కో కబ్జాలోనే ఉన్నాయని నిరూపించేందుకే ఈ పర్యటనలని భావించవచ్చు.

అధికారులను పంపిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం తమని వేధిస్తోందంటూ బీఆర్ఎస్‌ వాదిస్తుంది. అదే… కాంగ్రెస్‌ నేతలను పంపిస్తే వారిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్‌ పార్టీ ప్రయత్నిస్తారు. అప్పుడు ‘ఏం దాచిపెట్టాలని అడ్డుకుంటున్నారు?’ అని ప్రశ్నించవచ్చు.

ముఖ్యంగా బీఆర్ఎస్‌ ముఖ్య నేతలకు భారీగా భూములు, ఫామ్‌హౌసులు ఉన్నాయనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మరింత బాగా తెలుస్తుంది. అక్కడ వారు మీడియాతో చెప్పే మాటలు కూడా ప్రజలకు బాగానే చేరుతాయి.

కనుక ఇది బీఆర్ఎస్‌ నేతలతో సిఎం రేవంత్‌ రెడ్డి ఆడుతున్న మైండ్ గేమ్‌ అని భావించవచ్చు. ఒకవేళ దీంతో ఎవరైనా ఒత్తిడికి గురై బ్రేక్ అయితే రేవంత్ రెడ్డి వ్యూహం మరింత ఫలించినట్లే.

కానీ రేవంత్ వ్యూహాన్ని కేసీఆర్‌ అర్థం చేసుకోలేనంత అమాయకులు కారు. కనుక కాంగ్రెస్‌ నేతల పర్యటనలను తాము పెద్దగా పట్టించుకోవడం లేదన్నట్లు, కేటీఆర్‌ చేత మొక్కుబడిగా మాట్లాడిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories