తెలంగాణ సాధించి పదేళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించిన కేసీఆర్ పదవిలో దిగిపోయే సరికి మిత్రుల కంటే శత్రువులనే ఎక్కువ సంపాదించుకున్నారు. నిజానికి ఆయన ఓటమికి ఇదీ ఓ కారణమే అని చెప్పొచ్చు.
కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీతో కయ్యం పెట్టుకున్నారు. తెలంగాణ కోసమే కయ్యమని ఆయన చెప్పుకున్నప్పటికీ, తాను జాతీయ నాయకుడుగా గుర్తింపు సంపాదించుకుని ఎదగాలనే తపనతోనే అని చెప్పవచ్చు. కానీ ఆయన వైఖరి వలన స్వయంగా ఆయన, బిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కూడా నష్టపోయింది.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు తన అధికారానికి అడ్డు తగలకూడదనుకున్నారు కనుక వాటిని సమాన దూరంలో ఉంచాలనుకున్నారు. కానీ ‘థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం’ అంటూ వాటితో కలిసి పనిచేస్తున్న పార్టీల చుట్టూనే తిరిగారు.
వాటిని తన నేతృత్వంలో పని చేయాలని కేసీఆర్ కోరుకోవడం విచిత్రం. అందువల్లే వాటిలో ఏ ఒక్కరూ ఆయనతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడలేదు. దాంతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ దేశ రాజకీయాలలో ఏకాకిగా మిగిలిపోయారు. ఇది విధానపరమైన పొరపాటు అని భావించవచ్చు.
అలా మిత్ర పక్షాలన్నిటినీ దూరం చేసుకొన్న కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఈసడించుకొంటూ శత్రువులను పెంచుకున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ సమర్ధించుకున్నారు. చివరికి తన ఆధ్యాత్మిక గురువుగా స్వయంగా ఎంపిక చేసుకున్న జీయర్ స్వామితో కూడా ఎందుకు శతృత్వం పెంచుకున్నారు?అనే ప్రశ్నకు సమాధానం లేదు.
ఒకవేళ కేసీఆర్ వైఖరి, విధానాలు, ఆలోచనలు అన్నీ సరైనవేనని ప్రజలు భావించి ఉండి ఉంటే, ప్రజలు ఆయనకె మళ్ళీ పట్టం కట్టేవారు కదా? కానీ ఆయనను కాదని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రజలు కూడా కేసీఆర్‌నిఎందుకు వద్దనుకున్నారు? అని నేటికీ ఆలోచిస్తున్నట్లు లేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని లేదా కూలిపోతుందంటూ మాట్లాడుతున్నారు.
కానీ సిఎం రేవంత్ రెడ్డి, పార్టీలో తనను తీవ్రంగా వ్యతిరేకించిన వారిని కూడా కలుపుకుపోతూ మంచి పేరు సంపాదించుకొంటున్నారు.
పార్టీలో, ప్రభుత్వంలో మాత్రమే కాదు… గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ప్రధాని నరేంద్రమోడీలతో కూడా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
రేవంత్ రెడ్డి హామీలన్నీ అమలుచేయగలరా లేదా? ఐదేళ్ళు అధికారంలో ఉండగలరా లేదా?అనే ప్రశ్నలు పక్కన పెడితే, ఓ ముఖ్యమంత్రి అందరినీ ఏవిదంగా కలుపుకుపోవాలో చూపుతున్నారు. దాంతో ఎటువంటి సత్ఫలితాలు, ప్రజలలో సదాభిప్రాయం ఏర్పడుతుందో చూడగలుగుతున్నాము.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ‘ఇగో’ పక్కన పెట్టి కేంద్రంతో సఖ్యతగా ఉంటే ఎంత మంచి జరుగుతుందో చూపిస్తున్నారు. ముఖ్యంగా దేశ ప్రధాని, రాష్ట్ర గవర్నర్ పట్ల ముఖ్యమంత్రి ఏవిదంగా వ్యవహరించాలో సిఎం రేవంత్ రెడ్డి ఆచరణలో చూపుతున్నారు.
ఇదివరకు ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ వస్తే కేసీఆర్ నగరంలోనే ఉన్నా మొహం చాటేసేవారు. కానీ నిన్న అదిలాబాద్‌లో జరిగిన కార్యక్రమాలలో సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ వెంట నడిచారు. ‘మీరు మా పెద్దన్న వంటివారని, రాష్ట్రాభివృద్ధికి మీ సహాయ సహకారాలు మాకు చాలా అవసరమని’ సభాముఖంగా విజ్ఞప్తి చేశారు.
కానీ దీనిని బిఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణంలో ప్రజలకు చూపిస్తూ, ‘కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు అయ్యాయని’ చెప్పుకొంది. కానీ గతంలో కేసీఆర్ ఇదేవిదంగా మోడీతో సఖ్యతగా ఉన్నప్పుడు ఏవిదంగా సమర్ధించుకున్నారో అందరికీ తెలుసు. కానీ సిఎం రేవంత్ రెడ్డి సఖ్యత కుంటె కుమ్మక్కు అంటున్నారు. కానీ ప్రజలు అలా అనుకొంటున్నారా?అంటే కాదనే చెప్పవచ్చు.
చివరిగా ఒక్క మాట: సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసిస్తూ, ఈవిదంగా విధేయత ప్రకటిస్తే కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం, అసహనం కలిగితే ఏమవుతుందో ఊహించుకోవచ్చు. అయినా రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం తన పరిధి దాటి కొంత సాహసమే చేస్తున్నారని చెప్పవచ్చు.




