కేటీఆర్‌ చిలక జోస్యం: 500 రోజుల్లో ఫలిస్తుందట!

Revanth Reddy’s Strategy Shakes BRS in Jubilee Hills

మరో పది రోజులలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి వ్యూహాలతో ఇప్పటికే బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి తారుమారు అయినట్లే ఉంది. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓటర్లను కాంగ్రెస్‌ వైపు ఆకర్షించడానికి ఏమేమి చేయాలో రేవంత్ రెడ్డి అవన్నీ చేశారు.

కానీ బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాత్రం ఇంకా పార్టీ శ్రేణులను భ్రమలోనే ఉంచుతున్నారు. ఈ ఉప ఎన్నికలో తప్పకుండా బీఆర్ఎస్‌ అభ్యర్ధి మాగంటి సునీతే గెలుస్తారని జోస్యం చెప్పారు.

ADVERTISEMENT

అంతేకాదు… మరో 500 రోజులలో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్‌ నేత్రుత్వంలో బీఆర్ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. ఇక్కడ వైసీపీ అధినేత జగన్‌ చెప్పినట్లే అక్కడ కేటీఆర్‌ కూడా “రెండేళ్ళు ఇట్టే గడిచిపోయాయి. కళ్ళు మూసుకుంటే చాలు… మరో మూడేళ్ళు ఇట్టే గడిచిపోతాయి. ఆ తర్వాత ‘మళ్ళీ మనమే’నన్నారు.

ఆర్ధిక పరిమితుల కారణంగా అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలు విషయంలో రేవంత్ రెడ్డి తడబడుతున్నప్పటికీ, రాజకీయ వ్యూహాలు రచించి అమలు చేయడంలో తనకు తానే సాటి అని ఈ ఉప ఎన్నికలతోనే మరోసారి నిరూపించుకున్నారు.

మహ్మద్ అజారుద్దీన్‌కి ఎమ్మెల్సీ పదవి పక్కన పెట్టేసినట్లు అందరినీ భ్రమింపజేశారు. బీఆర్ఎస్‌ పార్టీ కూడా ఆ భ్రమలోనే మాగంటి సునీతని అభ్యర్ధిగా ప్రకటించేసింది. కానీ అదే పెద్ద పొరపాటని తర్వాత అర్ధమయ్యే ఉంటుంది.

రేవంత్ రెడ్డి చాలా తెలివిగా మజ్లీస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నవీన్ యాదవ్‌ని అభ్యర్ధిగా నిలబెట్టి అసదుద్దీన్ ఓవైసీతో మద్దతు ప్రకటింపజేశారు. ఆ షాక్ నుంఛి కేటీఆర్‌ తేరుకునే సరికి మహ్మద్ అజారుద్దీన్‌ని మంత్రి పదవి కట్టబెట్టారు.

నిన్న ముంబైలో ఓ శుభాకార్యానికి హాజరైనప్పుడు, అక్కడే ఉన్న బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కూడా ఓ ఫోటో దిగి మీడియాలో వచ్చేలా చేశారంటే సిఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏవిదంగా ఉంటాయో అర్ధమవుతుంది.

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే చనిపోవడంతో ఖాళీ అయిన ఈ సీటుని ఒకవేళ బీఆర్ఎస్‌ పార్టీ గెలుచుకోలేకపోతే, మూడేళ్ళ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగే శాసనసభ ఎన్నికలలో కేటీఆర్‌ ఏవిదంగా బీఆర్ఎస్‌ పార్టీని గెలిపించుకోగలరు?

బీఆర్ఎస్‌ పార్టీ క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ రెండేళ్ళుగా ఫామ్‌హౌసు నుంచి బయటకు రాని కేసీఆర్‌, మూడేళ్ళ తర్వాత ఎలా వస్తారు?

ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనలేకపోతున్న అప్పుడు ఎన్నికలలో పార్టీని ముందుండి నడిపించగలరా?గెలిపించగలరా? ముఖ్యమంత్రి కాగలరా?

కేసీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీ అదృష్టం బాగుండబట్టి ఫోన్‌ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులకు కేంద్రం బ్రేకులు వేసింది. లేకుంటే ఆయన పరిస్థితి, పార్టీ పరిస్థితి ఏమిటి?

కేంద్రం బ్రేకులు వేసినంత మాత్రాన్న రేవంత్ రెడ్డి చేతులు ముడుచుకొని కూర్చుంటారా? రాబోయే మూడేళ్ళలో బీఆర్ఎస్‌ పార్టీని చావు దెబ్బ తీయడానికి ఇంకేమి వ్యూహాలు రచిస్తారో?వాటిని కేటీఆర్‌ ఎదుర్కోగలరా?

ఈలోగా కల్వకుంట్ల కవిత పార్టీని నిలువునా చీలిస్తే కేటీఆర్‌ ఏం చేస్తారు? కనుక చిలుక జోస్యం ఫలిస్తుందో లేదో తెలుసుకునేందుకు 500 రోజులు ఎదురు చూడనవసరం లేదు. నవంబర్‌ 14న తెలిసిపోతుంది.

ADVERTISEMENT
Latest Stories