తెలంగాణకు కొత్త విమానాశ్రయాలు.. టీడీపి సహకారంతో!

Revanth Reddy, Ram Mohan Naidu & Telangana Airports

ఒక దేశాధినేత మొండి వైఖరి వలన అమెరికా-ఇరాన్‌, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు జరుగవచ్చు. ఒక రాష్ట్రాధినేత మొండి వైఖరి వలన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవచ్చు. లేదా అభివృద్ధి నిలిచిపోవచ్చు. అలాగే రాజకీయ పార్టీల అధినేతల వైఖరి వలన ఆయా పార్టీలు దారుణంగా ఓడిపోవచ్చు. కనుక అధినేత దేశానికైనా పార్టీలకైన అధినేత వైఖరే చాలా కీలకమని స్పష్టమవుతోంది.

ప్రధాన మంత్రి అవుదామనుకున్న కేసీఆర్‌ తన అహంకారం వలన చివరికి ఫామ్‌హౌసులో పడ్డారు. కేంద్ర మంత్రి అవుతారనుకున్న ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో పడ్డారు. ఇప్పుడు తండ్రినే ద్వేషిస్తున్నారు.

ADVERTISEMENT

కేసీఆర్‌ అహం వలన ఆయన, కుటుంబం, బీఆర్ఎస్‌ పార్టీ నష్టపోతే అందుకు ప్రజలు చింతించాల్సిన అవసరం ఉండదు. కానీ ఆయన అహం వలన తెలంగాణకు కొత్తగా ఒక్క విమానాశ్రం కూడా ఏర్పాటు కాలేదు.

సిఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారైనప్పటికీ, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాని మోడీతో వినయంగా, మర్యాదగా వ్యవహరిస్తుంటారు. కేంద్ర మంత్రులతో కూడా సఖ్యతగా ఉంటారు.

పైగా గతంలో టీడీపిలో పరిచయాలు, స్నేహాలు ఇప్పుడు బాగా పనికివస్తున్నాయి. సిఎం రేవంత్‌ రెడ్డి అభ్యర్ధన మేరకు పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్‌లో రెండేళ్ళలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

తాజాగా గతంలో టీడీపిలో పనిచేసిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని ఢిల్లీలో కలిసి, కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు సహకరించాల్సిందిగా అభ్యర్ధించారు. అయన సానుకూలంగా స్పందించారు.

భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన ప్రాంతాలను ఇది వరకు కేంద్ర బృందం పరిశీలించి, అక్కడ సాధ్యపడదని తేల్చాయి.

కనుక రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ప్రదేశాలను ఎంపిక చేసింది. వాటిని పరిశీలించేందుకు ఈ నెల 7న కేంద్ర బృందాన్ని పంపిస్తానని పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకి హామీ ఇచ్చారు.

ఆ బృందం నివేదిక అనుకూలంగా ఉంటే, వీలైనంత త్వరగా అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకి కృషి చేస్తానని పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారని తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు.

అటు జాతీయ స్థాయిలో, ఇటు తెలంగాణ రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్‌, బిజేపిలు పరస్పరం కత్తులు దూసుకుంటునప్పటికీ, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు చాలా అవసరమని కేసీఆర్‌ కంటే వయసులో చాలా చిన్నవారైన సిఎం రేవంత్‌ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ప్రధాని మోడీతో వినయంగా, సఖ్యతగా ఉంటూ పనులు సాధించుకుంటున్నారు.

చివరిగా ఒక మాట: బీఆర్ఎస్‌ పార్టీ నేతలు సిఎం చంద్రబాబు నాయుడుని, ఆంధ్రా నాయకులను ఎంతగా ద్వేషించినప్పటికీ, మళ్ళీ వారి ద్వారానే తెలంగాణకు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories