రేవంత్ కూడా కూల్చివేత తోనే మొదలు… కానీ ప్రజలు మెచ్చే కూల్చివేత

Revanth Reddy

2019 ఏపీలో జరిగిన ఎన్నికలలో ఊహించని విజయ సాధించిన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీసుకున్న మొదటి నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీ ప్రభుత్వం హయాంలోప్రజల సమస్యలు దగ్గరనుండి విని వాటికి పరిష్కారాలను సూచించాడనికి తన నివాసానికి దగ్గరలో ఉండవల్లి ప్రాంతంలో చంద్రబాబు ప్రజావేదికను నిర్మించారు.

అయితే ప్రజలు ప్రభుత్వం దగ్గరకు రావడానికి, ముఖ్యమంత్రికే నేరుగా తమ సమస్యలను వెల్లడించడానికి నిర్మించిందే ప్రజావేదిక. ఒక్క ముక్కలో చెప్పాలంటే “ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా” ప్రజాధనంతో కట్టిన నిర్మాణమే ప్రజావేదిక.అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అదేదో రాష్ట్ర ముఖ్య సమస్యగా భావించి అక్రమ కట్టడాల కూల్చివేతల పేరుతో ప్రజావేదికను కూల్చివేశారు.

ADVERTISEMENT

ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య ఉన్న వారదని జగన్ మోహన్ రెడ్డి ఒకే ఒక్క నిర్ణయంతో కూల్చివేసి ప్రజలను ప్రభుత్వానికి దూరం చేశారు.ప్రజావేదికతో మొదలైన కూల్చివేతలు జగన్ ప్రభుత్వంలో ఇప్పటికి నిర్విరామంగా కొనసాగుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలుపెడుతూనే ఉన్నాయనుకోండి. అయితే తెలంగాణ విషయానికి వస్తే..,తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ కూడా ఎంచుకున్న మొదటి నిర్ణయం కూల్చివేతలే కావడం గమనార్హం.అయితే ఇక్కడి కూల్చివేతలకు ఏపీలో కూల్చివేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఒక్కసారి గమనిస్తే..,ప్రజాదర్బార్ నిర్వహించడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రగతి భవన్ ఏర్పాటు. అయితే కేసీఆర్ ప్రజాదర్బార్ పేరు మీద ప్రగతి భవన్ నిర్మించినప్పటికీ అందులో ప్రజలకు అనుమతి లేకుండా భవనం చుట్టూ ఇనుప కంచెలు వేసి అదేదో కేసీఆర్ సొంత ఆస్తి లెక్క వ్యవహరించారు.

అయితే ప్రభుత్వాల మార్పుతో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ తన ప్రమాణస్వీకార జరిగే సమయంలోనే జిఏహెచ్ మిసి అధికారుల సాయంతో ప్రగతి భవన్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, తొలగించే చర్యలు చేపట్టడం జరిగిపోయింది. నేటితో తెలంగాణలో దొరల పాలన ముగిసి ప్రజాపాలన మొదలవ్వబోతుంది.తెలంగాణ ప్రజలందరూ వారి సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకోవడానికి వీలుగా ప్రగతి భవన్ కంచెలను మన ప్రభుత్వం తొలగిస్తుంది అంటూ రేవంత్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

రేపు ప్రగతి భవన్ లో నిర్వహించే ప్రజాదర్బార్ లో స్వేచ్ఛగా ప్రజలందరూ పాల్గొనాలి. ఇదే తెలంగాణ ప్రజలకు నా ఆహ్వానం అంటూ రేవంత్ ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య ఉన్న కంచెను కూల్చారు. కానీ ఏపీలో ఇందుకు విరుద్ధంగా కూల్చివేత కార్యక్రమం జరిగింది. ఒకరు ప్రజలకు చేరువ కావడానికి కూల్చివేతలు మొదలుపెడితే ఒకరు ప్రజలను ప్రభుత్వానికి దూరం చేయడానికి కూల్చివేతలను నమ్ముకున్నారు.మొత్తానికి ఇద్దరి రెడ్డి గారి పాలనలు కూల్చివేతలతోనే ప్రారంభం కావడం యాదృచ్ఛికమే.

ADVERTISEMENT
Latest Stories