ఒకప్పుడు… అంటే కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలంటే కబాడీ ఆటలాగే ఉండేది. ప్రతీ ఎన్నికలో గేలిచేస్తూ ఉండేది. కానీ ఆ ఫార్ములా శాసనసభ ఎన్నికలలో పనిచేయలేదు.
తమలో తామే కీచులాడుకునే వానర సైన్యం వంటి కాంగ్రెస్ నేతలను వెంట పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎన్నికలనే సముద్రం దాటి కేసీఆర్‌ని ఓడించారు. కనుక ఎన్నికల వ్యూహాలలో కేసీఆర్‌ని మించిన ఘనుడు సిఎం రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు.
కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మళ్ళీ రేవంత్ రెడ్డి, కేసీఆర్ శక్తియుక్తులకు పరీక్షగా నిలిచాయి. అయితే మాగంటి సునీతని నిలబెట్టి సానుభూతి ఓట్లతో గెలవాలని కేసీఆర్ అనుకుంటే, ఎవరూ ఊహించని విదంగా మజ్లీస్, మహ్మద్ అజారుద్దీన్, ముస్లిం ఓటర్లతో సిఎం రేవంత్ రెడ్డి ఆయనకు చెక్ పెట్టడానికి పావులు కదిపారు.
శుక్రవారం ఉదయం మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రకటించగానే బీఆర్ఎస్ పార్టీలో కలకలం మొదలైంది. బీజేపి అయితే నేరుగా ఎన్నికల సంఘం ప్రదానాదికారిని కలిసి అభ్యంతరం తెలిపింది.
ఎన్నికలకు ముందు ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం అంటే నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేయడమే. కనుక ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని బీజేపి నేతలు పిర్యాదు చేశారు.
నిజానికి వారు బీఆర్ఎస్ మనసులో మాటనే చెప్పారని భావించవచ్చు. ఎందుకంటే, ఈ ఎన్నికలలో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్యనే సాగుతోంది కనుక.
కాళేశ్వరం కేసులో సీబీఐ చేత విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ వ్రాసినా కేంద్రం పట్టించుకోలేదు. కనుక బీజేపి, బీఆర్ఎస్ పార్టీల మద్య అవగాహన ఉందని స్పష్టమైందని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తూనే ఉన్నారు. కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపునే బీజేపి నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి పిర్యాదు చేశారని కాంగ్రెస్ మంత్రులు అభిప్రాయపడుతున్నారు.
అయితే మంత్రి వర్గంలోకి మంత్రులను నియమించుకోవడానికి ఈ ఉప ఎన్నికలకు సంబంధం ఏమిటి? ఓటమి భయంతోనే మహ్మద్ అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తుంటే బీజేపి, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుపడుతున్నాయని కాంగ్రెస్ మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు.
కనుక ఈ తాజా నియామకంపై బీఆర్ఎస్ పార్టీ రాద్దాంతం చేస్తే డానికే ఇంకా ఎక్కువ నష్టం కలుగుతుంది. బీజేపి ఎంత రాద్దాంతం చేసినా దానికి కొత్తగా కలిగే లాభం, నష్టం ఏమీ ఉండవు.







