టీమిండియా తాజా సంచలనం రిషబ్ పంత్ మరోసారి తృటిలో సెంచరీ చేసుకునే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇలాగే సెంచరీని మిస్ చేసుకున్న రిషబ్, నేడు వ్యక్తిగత స్కోర్ 92 పరుగుల వద్ద ఉండగా పెవిలియన్ చేరుకున్నాడు. హైదరాబాద్, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్ జరుగుతున్న రెండో టెస్టు, మూడో రోజున 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాబ్రియేల్ బౌలింగ్ లో రిషబ్ అవుట్ అయ్యాడు. 134 బంతులాడిన రిషబ్, 11 ఫోర్లు, 2 సిక్సర్లను బాదాడు.
ఓవర్ నైట్ స్కోరు 308/4 వద్ద నేటి ఆటను ప్రారంభించిన భారత్, మూడు వికెట్లను వడివడిగా కోల్పోయింది. 322 పరుగుల వద్ద అజింక్యా రహానే (80) అవుట్ కాగా, ఆపై క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా పరుగులేమీ చేయకుండా అదే ఓవర్ లో వెనుదిరిగాడు. సెంచరీ సాధిస్తాడని భావించిన రిషబ్ అవుటైన అనంతరం కూడా వికెట్ల పతనం కొనసాగింది. అశ్విన్ కాసేపు క్రీజులో ఉండడంతో టీమిండియా స్కోర్ 350 మార్కును దాటింది. భారీ ఆధిక్యం సాధిస్తుందని భావించిన టీమిండియా స్వల్ప ఆధిక్యంతో సరిపెట్టుకుంది.
[m9adh]



