మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్ దెబ్బకు లంక ఆటగాళ్లు కళ్లు తేలేశారు. సిక్సర్లను ఇంత అలవోకగా ఇలాక్కూడా కొట్టొచ్చా అనే రీతిలో రోహిత్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో రోహిత్ డబుల్ సెంచరీ కొట్టాడు.
మొత్తం 151 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 12 సిక్సర్లు, 13 ఫోర్ల సహాయంతో ద్విశతకం (208) నాటౌట్ గా నిలిచాడు. అంటే సిక్సర్లు, బౌండరీల ద్వారానే 25 బంతుల్లో 124 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా రోహిత్ అవతరించాడు. అలాగే కెప్టెన్ గా ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ గా కూడా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.
దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. రోహిత్ 208 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ధావన్ 68, అయ్యర్ 88, ధోనీ 7, పాండ్యా 8 పరుగులు చేశాడు. చివరి బంతికి పాండ్యా ఔట్ అయ్యాడు. లంక బౌలర్లలో ఫెర్నాండో 3, పతిరన ఒక్క వికెట్ తీశారు. మొదటి వన్ డే లో ఘోర పరాజయానికి గట్టి ప్రతీకారమే తీర్చుకొనేందుకు టీమిండియా సిద్ధమైంది.





