మూడు వన్డేలు ముగిసిన సమయానికి చెరో విజయం, ఒక టై మ్యాచ్ తో 1-1తో సమానంగా ఉన్న టీమిండియా – విండీస్ లకు నాలుగవ మ్యాచ్ ‘డూ ఆర్ డై’ లాంటిది. దీంతో టాస్ గెలిచిన అనంతరం మరో అంశానికి ఆస్కారం లేకుండా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 377 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది.
[m9ad]
వరుసగా మొదటి మూడు మ్యాచ్ లలో మూడు సెంచరీలను నమోదు చేసి మాంచి ఊపు మీదున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ సారి 16 పరుగులకే ఔటైనప్పటికీ, భారీ సెంచరీ బాధ్యతను రోహిత్ శర్మ అందిపుచ్చుకున్నాడు. ‘తాను కొడితే ఎలా ఉంటుందో తనకు కూడా తెలియదు’ అనే విధంగా మరోసారి విండీస్ బౌలర్లపై చెలరేగిపోయాడు.
కాస్త నింపాదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్, ఓపెనర్ ధావన్ (38), కోహ్లి వికెట్లను కోల్పోయిన తర్వాత అంబటి రాయుడుతో కలిసి చక్కని భాగస్వామ్యానికి పునాదులు వేసారు. వీరిద్దరూ మూడవ వికెట్ కు ఏకంగా 211 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోర్ అవలీలగా అందుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కొట్టిన షాట్లను చూసి మంత్రముగ్ధులు అవ్వడం వీక్షకుల వంతు అయ్యింది.
అలాగే మంచి బంతులను కూడా బౌండరీలు, సిక్సర్లుగా మలుస్తున్న రోహిత్ శర్మ షాట్లకు విండీస్ బౌలర్లు నీరసించిపోయారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరో డబుల్ సెంచరీ ఖాయం అనుకున్న తరుణంలో… 43.5వ బంతి వద్ద నర్స్ వేసిన ఆఫ్ సైడ్ వైడ్ ను కట్ చేసిన రోహిత్ బ్యాక్ పాయింట్ లో ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చి (162) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు.
రోహిత్ సాధించిన ఈ భారీ సెంచరీతో ఓ అరుదైన రికార్డు కూడా వచ్చి చేరింది. 2013 నుండి వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధిస్తున్న టీమిండియా క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలుస్తున్నాడు. 2013 నుండి మొదలు పెడితే, 209, 264, 150, 171 (నాటౌట్), 208 (నాటౌట్), 162 పరుగులతో తన రేంజ్ ఏమిటో మరోసారి ప్రపంచ క్రికెట్ కు చాటిచెప్పాడు.



