చెన్నైలోని విశాల్ నివాసంపై జీఎస్టీ అధికారులు దాడులు చేసారని, దీనికి గానూ అధికారులు వేసిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని విశాల్ చెప్పినట్లుగా సోమవారం హల్చల్ చేసిన వార్తల విషయం తెలిసిందే. “మెర్సెల్” సినిమాపై తాను చేసిన ట్వీట్ కు, ఈ దాడులకు సంబంధం ఉందని భావించడం లేదని, నిర్మాతల ప్రయోజనాలే తనకు ముఖ్యమని విశాల్ చెప్పినట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేసాయి. రాజకీయాలు ముఖ్యం కాదని, ‘మెర్సెల్’ సినిమా వివాదానికి పరిష్కారం కావాలని, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడైన హెచ్. రాజా తాను పైరసీ సినిమా చూశానని అన్నారని, అది తప్పు అన్న విషయం ఆయనకు కూడా తెలుసని, ఇది చట్టరీత్యా నేరమని విశాల్ అభిప్రాయపడ్డాడు.
అయితే ఈ వార్తలను చెన్నై జోన్ జీఎస్టీ డీజీ ఖండించారు. మీడియా ప్రసారం చేసిన వార్తల్లో వాస్తవం లేదని, ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసారు. చెన్నైలోని వడపళనిలో విశాల్ కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సోదాలు కొనసాగినట్లు తమిళ, తెలుగు మీడియాలో వార్తలు వెలువడ్డాయని, అవన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ లక్షల్లో పన్ను ఎగవేసినట్లు సమాచారం రావడంతో సోదాలు చేపట్టినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, అవన్నీ కేవలం ఒట్టి పుకార్లుగా తేల్చారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు హెచ్.రాజాపై మండిపడిన కారణంగానే విశాల్ పై బిజెపి ప్రభుత్వం ఈ దాడులను నిర్వహించిందని జరిగిన ప్రచారం తెలిసిందే.


