500 కోట్ల ఋషి కొండ…5 ఏళ్ళు కూడా.?

Rushi Konda Palace Exposed: Cracks Before Use

జగన్ ముఖ్యమంత్రిగా, వైసీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో నిర్మించిన ఏకైక భారీ నిర్మాణం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఋషి కొండ ప్యాలస్ మాత్రమే అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.

వైసీపీ 2024 లో తిరిగి అధికారంలోకి వస్తుంది, విశాఖ రాజధానిగా జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ఋషి కొండ ప్యాలస్ నుంచే పాలన సాగిస్తారు అనే ఖచ్చితమైన అభిప్రాయంతో భారీ వ్యయప్రయాసలకోర్చి మరి వైసీపీ ఈ నిర్మాణాలను పూర్తి చేసింది.

ADVERTISEMENT

అయితే సుమారు 500 కోట్లు ఖర్చు పెట్టి మరి వైసీపీ ఎంతో విలాసవంతంగా నిర్మించిన ఈ ప్యాలస్ లోని కొన్ని గదులలో అప్పుడే స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. ప్రజలను, ప్రతిపక్షాలను కనీసం మీడియాను సైతం ఋషి కొండ మీద అడుగు పెట్టనీయకుండా ఎంతో సీక్రెట్ గా కొండ చుట్టూ పరదాలు కట్టి, గ్రీన్ మాట్స్ వేసి వైసీపీ నిర్మించిన ఈ భవనం అసలు ఉపయోగంలోకి రాక ముందే రిపేర్లతో దర్శనమిచ్చింది.

విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలతో కలిసి ఋషి కొండ ప్యాలస్ సందర్శనకు వెళ్లారు. ఆ సమయంలోనే ఈ దృశ్యాలు పవన్ కంట పడ్డాయి. కాన్ఫరెన్స్ హాల్ తో పాటుగా మరో రెండు గదులలో స్లాబ్ పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి నేలమీద పడున్నాయి.

స్లాబులు డామేజ్ అయిన చోట వర్షపు నీరు చేరుకొని ఉండడంతో పవన్ వెంటనే వాటి మరమ్మత్తులకై అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అలాగే గతంలో ఇదే రుషికొండ నుంచి ప్రభుత్వానికి ఏడాదికి 7 కోట్ల ఆదాయం సమకూరేదని, కానీ ఇప్పుడు నిర్మాణాలు చేపట్టడంతో కోటి రూపాయల కరెంటు బిల్లు పెండింగ్లో ఉందంటూ అధికారులు విషయాన్ని పవన్ దృష్టికి తెచ్చారు.

అయితే ఈ ఋషి కొండ దీన అవస్థ గురించి జనసేన పార్టీ తరుపున అసెంబ్లీ లో మాట్లాడాలంటూ తన పార్టీ ఎమ్మెల్యే లను ఆదేశించిన పవన్ ప్యాలస్ మెయింటెనెన్స్ మీద ఆరా తీశారు.

అయితే గతంలో అమరావతి నిర్మాణాల నాణ్యత పై నానా హంగామా చేసిన వైసీపీ ఇప్పుడు తన ప్రభుత్వం హయాంలో తన పార్టీ అధినేత కోసం నిర్మించిన ఈ భారీ స్థాయి భవనాలలో సైతం నిర్మాణ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మరి దీనికి వైసీపీ దగ్గర సమాధానం ఉంటుందా.?

2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర రాజధానిగా అమరావతి స్థిరపడగా అక్కడ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే నాడు అసెంబ్లీలోకి వరద నీరు, టీడీపీ అవినీతి రాజకీయం అంటూ అమరావతి పై బురద రాజకీయం చేసిన వైసీపీ నేడు రుషికొండ నిర్మాణాల నాణ్యత పై సమాధానం చెప్పగలదా.?

జగన్ తన హయాంలో నిర్మించిన ఈ ఏకైక కట్టడం కనీసం వాడుక లోకి రాకమునుపే ఇలా పెచ్చులు ఊడిపోవడం, వర్షపు నీరు లోపలికి చేరుకోవడం అంటే 500 కోట్లు ఖర్చు చేస్తే కనీసం ఐదేళ్లు కూడా నాణ్యత లేకపోవడం పై జగన్ నుంచి వైసీపీ నేతల వరకు ప్రభుత్వం తో పాటుగా ప్రజలకు జవాబు చెప్పాల్సిందే అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories