ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపేస్తున్న ఇద్దరు సంగీత దర్శకులలో థమన్ ఒకరు. ఇటీవల కూడా “మహానుభావుడు” ద్వారా అదిరిపోయే ట్రాక్స్ ను అందించిన థమన్, తాజాగా “జవాన్” సినిమాకు కూడా సూపర్ సంగీతాన్ని ఇచ్చాడు. మాంచి ఊపులో ఉన్న థమన్ కు “తొలిప్రేమ” రూపంలో భారీ ఒత్తిడి ఎదురవుతోంది. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్లుగా తాజాగా చేసిన ప్రకటనతో ఈ సినిమా ఆడియో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అర్ధమవుతోంది.
దీనిపై స్పందించిన థమన్… తన వంతు కృషి చేసానని, ఆల్బమ్ కూడా అద్భుతంగా వచ్చిందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. అయితే పవన్ కళ్యాణ్ “తొలిప్రేమ” సినిమా పాటలు కుర్రకారును ఏ రేంజ్ లో ఊపేసాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవా అందించిన “తొలిప్రేమ” పాటలు ఇప్పటికీ యువతరాన్ని అలరిస్తూ ఉంటాయి. అలాంటి టైటిల్ కు థమన్ సంగీతం అందిస్తుండడంతో, ఈ సినిమా ఆడియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సహజంగా వరుణ్ తేజ్ సినిమాల ఆడియోలపై ప్రేక్షకులకు అంత ఆసక్తి ఉండదు గానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆల్ టైం సూపర్ హిట్ మూవీ టైటిల్ పెట్టుకోవడంతో అందరి చెవులు తాజా “తొలిప్రేమ” ట్రాక్స్ పై పడ్డాయి. మరి ఆ అంచనాలను థమన్ అందుకుంటాడో లేదో గానీ ట్రేడ్ వర్గాలు అయితే… లేటెస్ట్ “తొలిప్రేమ” పాటలు కూడా దుమ్ము దులపడం ఖాయం అంటున్నారు. అదే జరిగితే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మూవీ అవకాశం కూడా లభిస్తుందేమో..!



