పుణ్యక్షేత్రాలలో శబరిమల అయ్యప్పస్వామికి ఉన్న విశిష్టత తెలియనిది కాదు. ఏడాదిలో కేవలం రెండున్నర్ర నెలల పాటు మాత్రమే దర్శనభాగ్యం కల్పించే ఆ శబరీశుడికి ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతున్నారని చెప్పడానికి నిదర్శనమే ఈ ఏడాది హుండీ ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది.
ఇప్పటివరకు తిరుపతి, షిర్డీ దేవాలయాలకు మాత్రమే భక్తులు అధిక సంఖ్యలో కానుకలు సమర్పించేవారు. కానీ ఈ ఏడాది మాత్రం అయ్యప్ప కూడా ఆల్ టైం రికార్డుకు చేరుకున్నారు. సదరు విషయాన్ని ట్రావెన్ కోర్ బోర్డు అధికారికంగా ధృవీకరించింది.
మండల పూజలు ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు… అంటే 25 రోజుల్లో 100 కోట్ల మేర ఆదాయం హుండీల ద్వారా భక్తులు సమర్పించినట్లుగా ప్రకటించారు. అంటే రోజుకు సరాసరిగా 4 కోట్ల రూపాయలు అన్న మాట. తిరుమలలో భక్తుల సంఖ్య బాగా ఉంటే కూడా ఇంతే స్థాయిలో ఆదాయం ఉంటుందన్న విషయం తెలియనిది కాదు.
ఈ రికార్డు ఆదాయం ఇక్కడితో ఆగేలా లేదు. ఇంకా మరో నెల రోజుల పాటు ఆ ‘చిన్ముద్ర రూపుడు’ భక్తులకు దర్శనం ఇవ్వనుండడంతో, ఈ సారి ఏకంగా 300 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ట్రావెన్ కోర్ బోర్డు ఆశిస్తోంది. మరో విశేషం ఏమిటంటే… ఈ గడిచిన 25 రోజులలో తుఫాన్ కారణంగా ఒక వారం రోజుల పాటు దేవాలయాన్ని మూసివేసారు కూడా!



