ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ, టీడీపీ భీమిలి అభ్యర్థి సబ్బంహరి తన అంచనాలు చెప్పారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కు పది సీట్లు పెరిగే అవకాశముందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి 100కిపైగా సీట్లలో తెదేపా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు గతంలో వచ్చిన దానికంటే ఇప్పుడు 20 సీట్ల వరకూ తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ చంద్రబాబుకు పట్టం కట్టబోతున్నారని, ఇది చారిత్రక అవసరమని అంతా గ్రహించారని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 లేదా 3 ఈవీఎంలు పని చేయకపోతే జగన్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దీని బట్టే ఎవరు పోలింగ్ ఎక్కువ జరగాలని కోరుకున్నారో అనేది తెలిసిపోతుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం అధికారుల మార్పిడిలో చూపిన శ్రద్ధ.. ఈవీఎంల నిర్వహణపై చూపితే బాగుండేదని ఎద్దేవా చేశారు.
పోలింగ్ ప్రక్రియలో తప్పులు జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించేందుకు జగన్‌కు భయమెందుకని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 79.64% కి చేరింది. ఇదే సమయంలో 2014 ఎన్నికలలో పోలింగ్ 77.96% గా ఉంది. ఈవీఎంలు సవ్యంగా పని చేసి ఉంటే ఖచ్చితంగా 82-83% నమోదు అయ్యేది. ఎక్కువ పోలింగ్ జరగడం అనేది తమకు మంచిదంటే తమకు అంటూ ఇరుపార్టీలు అంచనాలు వేస్తున్నాయి.



