భయపడొద్దని జగన్‌ చెపుతున్నా సజ్జల వినరే…

YSRCP-Sajjala-Rama-Krishna-Reddy

పాపం… సజ్జల రామకృష్ణా రెడ్డి ఇప్పుడు పూర్తిగా సైలంట్ అయిపోయినా ఇదివరకు చేసిన పాపాల కారణంగా కష్టాలు తప్పడం లేదు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లు జగన్‌ ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణా రెడ్డి ఆనాతి లేనిదే ఏదీ జరిగేది కాదు… అని వైసీపిలో నుంచి బయటకు వచ్చిన వారే చెపుతుంటారు.

ADVERTISEMENT

కుట్రలైనా, కుతంత్రలైనా అన్నీ సజ్జల డైరెక్షన్‌లోనే జరిగేవని బల్లగుద్ది మరీ చెపుతుంటారు. అటువంటి వాటిల్లో మంగళగిరి టిడిపి కార్యాలయంపై వైసీపి దాడి కూడా ఒకటని టిడిపి కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కనుక ఆ కేసుపై విచారణ జరుపుతున్న పోలీసులు సజ్జల రామకృష్ణా రెడ్డి పేరుని 120వ నిందితుడుగా చేర్చారు.

ఆ దాడిలో పాల్గొన్నవారిని అరెస్ట్ చేసి విచారించినప్పుడు వారిలో కొందరు సజ్జల రామకృష్ణా రెడ్డి డైరెక్షన్‌లోనే చేశామని చెప్పారు.

అయితే నిందితులు చెప్పిన ఆ మాట పట్టుకొని ఈ కేసులో తన పేరుని నిందితుడుగా చేర్చడం సరికాదని, ఇది రాజకీయ కక్షపూరితంగా చేస్తున్నదేనని సజ్జల రామకృష్ణా రెడ్డి వాదిస్తున్నారు.

ఈ మేరకు రాష్ట్ర హైకోర్టులో సజ్జల రామకృష్ణా రెడ్డి పిటిషన్‌ వేశారు. నేను చట్టపరమైన రక్షణ పొందకుండా అడ్డుకునేందుకే సెక్షన్ 41ఏ కింద పోలీసులు తనపై కేసు నమోదు చేసి దానిలో హత్యాయత్నం సెక్షన్ జోడించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేదని, తాను అమాయకుడినని కనుక పోలీసులు తనని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని సజ్జల రామకృష్ణా రెడ్డి హైకోర్టుని అభ్యర్ధించారు. కోర్టు ఎటువంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటానని పిటిషన్‌లో హామీ ఇచ్చారు. దీనిపై హైకోర్టు నేడు విచారణ జరుపనుంది.

అయినా జగన్మోహన్‌ రెడ్డి నిన్ననే తాడేపల్లి ప్యాలస్‌లో పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఎవరూ కేసులు, అరెస్టులకు భయపడొద్దు… పోరాడుతూనే ఉండండి… అప్పుడే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని” చెప్పారుగా… మరి సజ్జల రామకృష్ణా రెడ్డి ఎందుకు భయపడుతున్నారు?జగన్‌ తనని కూడా వాడుకొని వదిలేశారని భావిస్తున్నారా? లేదా వైసీపీలో ఎవరి తిప్పలు వారు పడక తప్పదని జగన్‌ చెప్పారని గ్రహించడం వలనా?

ఒకప్పుడు రాష్ట్రంలో యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీస్ వ్యవస్థని కంటిసైగతో శాశించిన సజ్జల రామకృష్ణా రెడ్డి ఇప్పుడు ఓ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేయడం ఖర్మ ఫలం కాకపోతే మరేమిటి?

ADVERTISEMENT
Latest Stories